భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రాజీవ్ కుమార్ ను నియమించారు. ఇంతకు ముందు ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర పదవి కాలం నేటితో ముగుస్తుండటంతో కొత్త నియామకం చేపట్టారు. మే 15 నుంచి రాజీవ్ కుమార్ నియామకం అమలులోకి రానుంది. ముగ్గురు సభ్యులు ఉండే పోల్ ప్యానెల్ లో సుశీల్ చంద్ర తర్వాత సీనియర్ అయిన రాజీవ్ కుమార్ ను ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించారు.
ప్రస్తుతం రాజీవ్ కుమార్ భారత 25వ ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరించనున్నారు. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోనే వచ్చే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పాటు 2024లో సాధారణ ఎన్నికల సమయంలో కూడా ఈయనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉండనున్నారు.
1960లో జన్మించిన రాజీవ్ కుమార్ 2025 వరకు పదవిలో ఉండనున్నారు. 1984 ఐఎఎస్ బ్యాచుకు చెందిన రాజీవ్ కుమార్ బీహర్/ జార్ఖండ్ రాష్ట్రంలో పలు పదవుల్లో పనిచేశారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో పని చేశారు. అప్పటి ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న అశోక్ లావాసా రాజీనామా చేయడంతో 2020 నుంచి రాజీవ్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. రాజీవ్ కుమార్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), ఎకనామికల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్ మెంట్ కౌన్సిల్( ఎఫ్ఎస్డీసీ), బ్యాంక్ బోర్డ్ బ్యూరో( బీబీబీ) ఇలా పలు సివిల్ సర్విసెస్ బోర్డుల్లో మెంబర్ గా ఉన్నారు.