తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయం పాలైంది. అధికారాన్ని కోల్పోయింది. ఇక ముఖ్యమంత్రిగా పని చేసిన ఎంకే.స్టాలిన్ కూడా ఓడిపోయారు. దీంతో డీఎంకేకు బిగ్ షాక్ తగిలినట్లైంది.
ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్.. స్టాలిన్ నివాసానికి వెళ్లి మద్దతు తెలిపారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రజనీకాంత్, స్టాలిన్ ఒకరినొకరు ఎదురెదురుగా కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు 118 స్థానాలు అవసరం ఉంది. కాంగ్రెస్ 5 స్థానాల మద్దతు పలికింది. దీంతో ఎమ్మెల్యేల మద్దతు 112కు చేరింది. ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం అయి ఉంది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆహ్వానించలేదు. ఇక స్టాలిన్ తన నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో సుమారు 8,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో డీఎంకే అసెంబ్లీలో ప్రతిపక్షంగా కూర్చోనుంది.
స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రాజకీయాలపై తలైవాకు ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. గతంలో కూడా డీఎంకేకు మద్దతు ఇచ్చారు. 1995లో రాజకీయాల్లోకి వస్తారని భావించినప్పటికీ రాలేదు. డీఎంకే కూటమికి ప్రచారం చేశారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే పార్టీకి మద్దతు తెలిపారు. 2017లో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి.. ఆరోగ్య కారణాలతో 2021లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
