Rajasthan: రాజస్థాన్ కోటాలో 70 ఏళ్ల రైతుకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. సదరు వ్యక్తి పిత్తాశయం(గాల్‌బ్లాడర్)లో ఏకంగా 6110 రాళ్లను విజయవంతంగా తొలగించారు. బాధతుడు చాలా ఏళ్లుగా కడుపునొప్పి, వాంతులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడని తెలిసింది. ఆరోగ్య సమస్యలపై ఆస్పత్రికి వెళ్లడంతో అసలు విషయం తెలిసింది. స్కానింగ్ రిపోర్టులో గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిందిగా సిఫారసు చేశారు.
రాళ్ల కారణంగా రోగి గాల్‌బ్లాడర్ పరిమాణం కూడా రెట్టింపు అయింది. అతడి గాల్ బ్లాడర్ మొత్తం రాళ్లతో నిండి ఉందని తేలింది. సహజంగా ఉండే పరిమాణం కన్నా 7×2 సెం.మీ నుండి 12×4 సెం.మీ వరకు దాదాపు రెట్టింపు అయింది. ప్రముఖ లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ దినేష్ జిందాల్ అతడికి శస్త్ర చికిత్స నిర్వహించారు.
Read Also: Minister Kollu Ravindra: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి కొల్లు రవీంద్ర
ఇది క్లిష్టమైన కేసు అని.. పిత్తాశయం రాళ్లు రోగికి తీవ్రమైన హాని కలిగిస్తాయని, ఈ పరిస్థితి ప్రాంక్రియాస్‌లో మంట, కామెర్లు, క్యాన్సర్‌కి కూడా దారి తీసే అవకాశం ఉందని చెప్పారు. కేవలం 30 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయిందని, అయితే రాళ్లను లెక్కించడానికి మాత్రం రెండు గంటల సమయం పట్టినట్లు వెల్లడించారు. పిత్తాశయంలో రంధ్రం కారణంగా కడుపులోకి రాళ్లు వ్యాపించే అవకాశం ఉన్నందున శస్త్రచికిత్స సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకున్నామని జిందాల్ చెప్పారు.
రోగికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని, అందుకే పిత్తాశయానికి ఎండో బ్యాగ్‌లో ఉంచి రాళ్లను తొలగించినట్లు ఆయన వివరించారు. పిత్తాశయంలో రాళ్లకు అధికంగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం, కోవ్వు పదార్థాలను తీసుకోవడం లేదా బరువు తగ్గడం వంటి అనేక కారణాలు ఉంటాయని డాక్టర్ చెప్పారు. కొన్ని సార్లు వంశ చరిత్ర కడా ఇలాంటి రోగాలకు కారణమవుతుందని చెప్పారు. శస్త్రచికిత్స జరిగిన తర్వాత రోగి డిశ్చార్జ్ అయ్యాడని, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని చెప్పారు.