Ajmer Sharif Dargah: దేశంలో పలు మసీదులపై ప్రస్తుతం కేసుల నడుస్తున్నాయి. కాశీలో జ్ఞానవాపి మసీదు, మథురలో శ్రీకృష్ణ జన్మభూమి, తాజాగా యూపీ సంభాల్ నగరంని జామా మసీదులు వివాదానికి కేరాఫ్‌గా మారాయి. గత ఆదివారం మసీదు సర్వేకు వచ్చిన అధికారులపై వేల మంది గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. దీనిపై ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ అత్యున్నత విచారణ చేస్తోంది. ఈ జామా మసీదు మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో హరిహర్ మందిరమని కోర్టులో కేసు నడుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని చారిత్రక ఆధారాలను హిందూ పక్షం కోర్టు ముందు ఉంచింది.
Read Also: Priyanka Gandhi: ఎంపీగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!
తాజాగా, అజ్మీర్ షరీఫ్ దర్గా నిజానికి శివాలయం అంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని దిగువ కోర్టు విచారణకు స్వీకరించింది. అజ్మీర్ వెస్ట్ సివిల్ జడ్జి మన్మోహన్ చందేల్ అధ్యక్షత వహించిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 20కి షెడ్యూల్ చేసింది. సూఫీ సన్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి, నిజానికి శివుడి ఆలయమని గుప్తా పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ కేసులో దర్గా కమిటీ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)కి సమన్లు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. దర్గా కిటికీలపై ఓం మరియు స్వస్తిక చిహ్నాలు కనిపించాయని హిందూ పక్షం తన పిటిషన్‌లో పేర్కొంది.
ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో శివాలయం ఉందని చెప్పడం ఇదే మొదటిసారి కాదు. నిజానికి, ఇది చాలా కాలంగా క్లెయిమ్ చేయబడింది. హిందూ సంస్థ మహారాణా ప్రతాప్ సేన 2022లో దర్గాను ఆలయమని పేర్కొంటూ విచారణ జరిపించాలని అప్పటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.