దేశ వ్యాప్తంగా మూడు, నాలుగు రోజులుగా విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో నరకయాతన పడుతున్నారు. ప్రయాణాలు ముందుకు సాగక కటిక నేలపైనే నిద్రపోయారు. ఇలా అన్ని ఎయిర్‌పోర్టులోనూ వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కూడా పరిస్థితులు చక్కబడలేదు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తం అయింది.
విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా 114 అదనపు ట్రిప్పులను నడుపుతోంది. అంతేకాకుండా 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. సబర్మతి-ఢిల్లీ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుందని ప్రకటించింది. అదనపు కోచ్‌లు, ప్రత్యేక రైళ్లు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
అహ్మదాబాద్-ఢిల్లీ మార్గంలో ‘ట్రైన్ ఆన్ డిమాండ్’ పథకం కింద సబర్మతి నుంచి ఢిల్లీకి సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఛార్జీలతో తక్షణమే ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. రైలు నెంబర్ 09497/09498 సబర్మతి-ఢిల్లీ సూపర్‌ఫాస్ట్ నాలుగు ట్రిప్పులు తిరగనున్నాయి. ఈ రైలు డిసెంబర్ 7-9 తేదీల్లో 10:55 గంటలకు సబర్మతి నుంచి బయల్దేరి మరుసటి రోజు 3:15 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఇలా ఆ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
