Amit Shah: వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ, నిన్న రాయ్‌బరేలీ స్థానానికి కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి సోనియాగాంధీ పోటీ నుంచి తప్పుకోవడంతో రాహుల్ గాంధీని కాంగ్రెస్ బరిలోకి దింపింది. అయితే, దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తారు. ఈ రోజు గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి భారీ మెజారిటీతో ఓడిపోతారని అన్నారు. దళితులు, గిరిజనులు, వెనకబడిన వారి కోసం నిర్దేశించిన రిజర్వేషన్లను ప్రతిపక్ష ఇండియా కూటమి దోచుకుంటోందని అమిత్ షా ఆరోపించారు.
‘‘కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయినప్పుడు వయనాడ్ వెళ్లారు. ఈ సారి వయనాడ్ నుంచి ఓడిపోతానని గ్రమించి అమేథీ కాకుండా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు’’ అని షా అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ‘‘ రాహుల్ బాబా నా సలహా తీసుకోండి. ప్రాబ్లం సీటుది కాదు, మీది. మీరు రాయ్‌బరేలీ నుంచి కూడా భారీ తేడాతో ఓడిపోతారు. మీరు పారిపోయినా ప్రజలు మిమ్మల్ని కనుగొంటారు’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
Read Also: Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ జాడ కోసం సీబీఐ సాయం కోరిన కర్ణాటక..
ప్రధాని మోడీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారనంటూ రాహుల్ బాబా అండ్ కంపెనీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి 2014, 2019లో పూర్తి మెజారిటీ ఉంది, కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎప్పుడూ టచ్ చేయలేదని, ఇది బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేదని, ఎవరూ కూడామ రిజర్వేషన్లను తాకరని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను దోచుకున్నది ఇండియా కూటమి అని ఆయన ఆరోపించారు.
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఓబీసీల రిజర్వేషన్లను దోచుకుని 4 శాతం కోటాను ముస్లింకు ఇచ్చారని, ఏపీలో కూడా 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని ఇది సరైన పద్ధతి కాదని షా పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు అధికారంలోకి వస్తే ఈ వర్గాలకు కేటాయించిన కోటాను లాక్కుని ముస్లింలకు ఇస్తారని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తోందని షా ఆరోపించారు. తమ ఓటు బ్యాంకు పోతుందనే భయంతో అయోధ్య రామమందిర ఆహ్వానాన్ని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేజ్రీవాల్ వంటి వారు తిరస్కరించారని అన్నారు. కాంగ్రెస్ ఆదివాసీలకు మొదటి నుంచి వ్యతిరేకమని, అందుకే దాదాపు 70 ఏళ్లపాటు దేశాధ్యక్షుడిగా గిరిజన వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నడూ అనుమతించలేదని షా పేర్కొన్నారు.
