Site icon NTV Telugu

Rahul Gandhi: “రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారు”.. మురుగరాజేంద్ర మఠంలో ఓ స్వామీజీ!

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కర్ణాటకలోని చిత్రదుర్గలోని శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని పలువురితో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అక్కడి స్వామీజీల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్వామీజీ రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అనగానే.. వెంటనే మఠాధిపతి కలుగుజేసుకుని దానిని సరిజేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ స్వామీజీలను కలుస్తున్నపుడు వారిలో ఒకరైన హవేరి హోసముత్ స్వామి “రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు” అని చెప్పినట్లు తెలుస్తోంది. వెంటనే మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు ఆ వ్యాఖ్యలను సవరిస్తూ “మా మఠాన్ని ఎవరు సందర్శించినా, వారు ధన్యులు” అని జోడించారు.

కర్ణాటక జనాభాలో దాదాపు 17 శాతం ఉన్న లింగాయత్‌లు సాంప్రదాయకంగా బీజేపీ ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా నేతలు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటినుంచే పార్టీలో ఐక్యతను కూడా పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. వచ్చే ఏడాది మేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చిత్రదుర్గలోని శ్రీ మురుగరాజేంద్ర మఠంలో రాహుల్ గాంధీ, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ పర్యటించారు.

2013 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. 2018 ఎన్నికల తర్వాత జనతాదళ్ (సెక్యులర్) భాగస్వామ్యంతో కొంతకాలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన అనంతరం ఒక సంవత్సరంలోనే కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ మళ్లీ రాష్ట్రంలో పాలనలోకి వచ్చింది.బీజేపీ మొదట్లో లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రి చేసింది. గతేడాది ఆయన స్థానంలో అదే వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మైని నియమించారు.

Raj Gopal Reddy: రేవంత్ కు రాజగోపాల్ రెడ్డి సవాల్.. మునుగోడులో గెలిచేది నేనే..!

అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పోరాడుతోంది. పార్టీ అధికారంలోకి వస్తే శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య, రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవికి పోటీ పడుతున్నారు. మంగళవారం రాత్రి జరిగిన రాష్ట్ర యూనిట్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నించారు, అక్కడ నాయకులు కలిసి పని చేయాలని, బహిరంగంగా మాట్లాడవద్దని ఆయన కోరారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ.. నాయకత్వ సమస్య అసలే లేదు. వ్యక్తిగత అభిప్రాయం కూడా ఆమోదయోగ్యం కాదు. గెలిచిన తర్వాత నాయకుడిని పార్టీ కొత్త ఎమ్మెల్యేలు, హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. ఈ కమిటీ తరచుగా సమావేశమై పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటుందని, కర్ణాటక కేంద్రంలో బీజేపీ దుష్టపాలనపై దూకుడుగా, ఐక్యంగా ముందుకు సాగాలని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. అంతర్గత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. తెలిసీ తెలియక అక్కడక్కడా మీడియా ముందు కొన్ని ప్రకటనలు చేస్తుంటారని, ఆ ఉచ్చులో పడవద్దని… పార్టీ నేతలు ఇంటా బయటా భిన్న స్వరాలతో మాట్లాడకూడదని అన్నారు.

Exit mobile version