కర్ణాటకలో అనూహ్యంగా అధికార మార్పు జరిగిపోయింది. గత కొంత కాలంగా జరుగుతున్న ఊహాగానాలుకు తగ్గట్టుగానే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే సిద్ధరామయ్య రాజీనామా వెనుక రాహుల్ గాంధీ చాలా వ్యూహమే రచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. 2028లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. 2029లో పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ గాంధీ కీలక వ్యూహం పన్నినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వ్యూహంలోనే భాగంగానే సిద్ధరామయ్యతో రాజీనామా చేయించినట్లుగా సమాచారం.
ఇక శుక్రవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో సిద్ధరామయ్య, కుమారుడు యతీంద్ర కలిశారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసం 10 జనపథ్‌లో కలిశారు. ఈ సమావేశంలో సోనియాగాంధీ లేరు. ఈ సందర్భంగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినందుకు రాహుల్‌గాంధీకి సిద్ధరామయ్య కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ.. సిద్ధరామయ్యకు కీలక హామీ ఇచ్చారు. రాజ్యసభతో పాటు జాతీయ స్థాయిలో పెద్ద బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో పార్టీకి అత్యంత కీలక నాయకుడిగా కొనసాగుతారని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం.
జాతీయ మీడియా కథనాలు ప్రకారం.. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికల్లో కూడా సిద్దరామయ్య కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఓబీసీ, సామాజిక న్యాయ రాజకీయాలపై జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రధాన స్వరంగా ఎదగాలని సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భవిష్యత్తులో మరింత పెద్ద జాతీయ బాధ్యతలు కూడా ఉండొచ్చని రాహుల్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా సిద్దరామయ్యను రాజ్యసభకు పంపే అంశంపైనా మరోసారి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే సిద్దరామయ్య మాత్రం ఇప్పటికే రాజ్యసభ అవకాశాన్ని తిరస్కరించారు. తాను కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగాలని, కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి లేదని పార్టీ హైకమాండ్‌కు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
అయితే కొత్త కర్ణాటక కేబినెట్‌లో తన కుమారుడు యతీంద్రతో పాటు తన అనుచరులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సిద్దరామయ్య కోరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవిపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం సిద్దరామయ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, పార్టీ భవిష్యత్ వ్యూహంపై చర్చించినట్లు సమాచారం.
రాహుల్ గాంధీతో జరిగిన గంటసేపు సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా కూడా పాల్గొన్నారు. “ఇది చాలా సానుకూల సమావేశం. అనేక అంశాలపై చర్చ జరిగింది” అని ఆయన తెలిపారు. కర్ణాటకలో అధికార మార్పిడి సజావుగా జరుగుతుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. “కచ్చితంగా. అధికార బదిలీలో ఎలాంటి అడ్డంకులు లేవు” అని సుర్జేవాలా స్పష్టం చేశారు. కాగా కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ గురువారం సిద్దరామయ్య రాజీనామాను అధికారికంగా ఆమోదించారు.
