NTV Telugu Site icon

Prashant Kishor: రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుంటే మంచిది.. కాంగ్రెస్‌కి ప్రశాంత్ కిషోర్ సలహా..

Pk

Pk

Prashant Kishor: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు రాకుంటే రాహుల్ గాంధీ తప్పుకోవడం మంచిదని అన్నారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన గత 10 ఏళ్లుగా పార్టీని నడుపుతున్నప్పటికీ, సరైన విజయం దక్కలేదని, అలాంటి సమయంలో విరామం తీసుకోవడం వల్ల నష్టం లేదని అన్నారు. రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుని, వేరే వారికి కాంగ్రెస్ పగ్గాలను అప్పగించాలని, మీ అమ్మ ఇదే పనిచేశారని, తన భర్త రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారని గుర్తు చేశారు. 1991లో పీవీ నరసింహారావుని బాధ్యతలు చేపట్టాలని సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా మంచి నాయకుల ముఖ్య లక్షణం ఏంటంటే.. వారు ఎందులో వెనకబడి ఉన్నారో తెలుసుకుని, దానిని పూరించడానికి చురుకుగా పనిచేస్తారని ఆయన చెప్పారు. ‘‘ కానీ రాహుల్ గాంధీకి అన్ని తెలుసని అనిపిస్తోంది.. మీరు సహాయం అవసరాన్ని గుర్తించకపోతే ఎవరూ మీకు సహాయం చేయలేరు. అతను సరైనదని భావించిన దాన్ని అమలు చేసే వ్యక్తి అవసరమని నమ్ముతున్నాడు. అది కుదరదు’’ అని పీకే అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే రాహుల్ గాంధీ నిర్ణయాన్ని గుర్తు చేస్తూ.. ఆ సమయంలో తాను వెనక్కి తగ్గానని , మరొకరిని ఆ పని చేయనివ్వండి అని చెప్పాడని, అయితే వాస్తవానికి అతను చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తున్నాడు అని పీకే చెప్పారు.

Read Also: Fire Accident: మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి

కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు సొంతగా ఏ నిర్ణయాలను తీసుకోలేమని చెబుతున్నారని, కనీసం మిత్ర పక్షాలతో సీట్ల షేరింగ్ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలను రాహుల్ గాంధీకి వదిలేస్తున్నారని చెప్పారు. అయితే, పార్టీలో ఓ సెక్షన్ నాయకులు మాత్రం రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసుకోరని చెబుతున్నారని చెబుతున్నారని అన్నారు.

ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, మీడియా వంటి సంస్థలు రాజీ పడినందునే తమ పార్టీకి ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయనే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇది పాక్షికంగా నిజం, అయితే పూర్తిగా నిజం కాదని పీకే అన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో 206 సీట్ల నుంచి 44కి పడిపోయిందని, ఆ సమయంలో బీజేపీ ప్రభావం తక్కువగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ దాని పనితీరులో నిర్మాణాత్మక లోపాలతో బాధపడుతోందని, వాటిని పరిష్కరించడం దాని విజయాలకు చాలా అవసరమని నొక్కి చెప్పారు.