Site icon NTV Telugu

Rahul Gandhi: బీజేపీ భారత్ పరువుని మంటగలుపుతోంది

Rahul Gandhi On Nupur

Rahul Gandhi On Nupur

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అల్లర్లకు తెరలేపాయి. అంతేకాదు.. ఇస్లామిక్ దేశాలు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం దోహాలోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది కూడా! నుపుర్‌తో పాటు ట్విటర్ మాధ్యమంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ జిందాల్‌పై పార్టీ వేటు వేసినప్పటికీ.. ఆ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు బీజేపీని ఎండగడుతున్నాయి.

తాజాగా రాహుల్ గాంధీ కూడా ఈ వివాదంపై స్పందించారు. భారత్ పరువును బీజేపీ మంటగలుపుతోందని, ఇది సిగ్గుపడాల్సినంతటి మతోన్మాదం అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘ఉద్దేశపూర్వకంగానే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ కారణంగా విదేశాల్లో మన దేశం బలహీనపడుతోంది. ఇలాంటి సిగ్గుమాలిన మతోన్మాదం మనల్ని ఏకాకులను చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువును కూడా మంటగలుపుతోంది’’ అని బీజేపీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అటు కేటీఆర్ సైతం.. బీజేపీ చేస్తోన్న మతోన్మాద వ్యాఖ్యలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి గానీ, దేశం కాదని ఆగ్రహించారు. విద్వేషం నూరిపోస్తున్న బీజేపీ, తొలుత భారతీయులకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Exit mobile version