NTV Telugu Site icon

Agnipath: అగ్నిపథ్‌పై లోక్‌సభలో రగడ.. రాహుల్‌-రాజ్‌నాథ్‌ మధ్య మాటల యుద్ధం

Rahulgandhi

Rahulgandhi

అగ్నిపథ్‌పై లోక్‌సభలో రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య వాడీవేడీ చర్చకు దారి తీసింది. అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్ష నేత తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్‌నాథ్ ఆరోపిస్తూ.. ఈ అంశంపై సభలో చర్చిస్తామన్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్‌పై రాహుల్ ప్రసంగంలో అగ్నిపథ్ పథకం దేశంలోని సైనికులు, వారి కుటుంబాల ఆర్థిక భద్రత మరియు గౌరవాన్ని దోచుకున్నారని ఆరోపించారు. పెన్షన్ లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు. ఈ పథకం.. యువత, రైతు వ్యతిరేక ధోరణిని బట్టబయలు చేసిందని రాహుల్ ఆరోపించారు.

కేంద్ర బడ్జెట్‌పై విపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రులు దీటుగా స్పందించారు. ఈ క్రమంలో దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశమైన ‘అగ్నిపథ్‌’ పథకాన్ని రాహుల్‌ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇదే అంశంపై పార్లమెంటులో ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మరోవైపు బడ్జెట్‌పైనా విపక్ష నేత అపోహలు వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వివరణ ఇస్తారని అన్నారు.

ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అంశాన్ని రాహుల్‌ గాంధీ మరోసారి లేవనెత్తారు. అమరులైన అగ్నివీరుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని రక్షణశాఖ మంత్రి చెప్పారని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదని, అది కేవలం ఇన్సూరెన్స్‌ మాత్రమేనని స్పష్టం చేశారు.