Waqf Bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని నెగ్గించుకుంది. పార్లమెంట్‌లోని ఉభయసభల్లో మెజారిటీ సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ సహా సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, వామపక్షాలు, ఎంఐఎం వంటి పార్టీలు మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆయా పార్టీల ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రస్తుతం బిల్లు, రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారబోతోంది. పలువురు కాంగ్రెస్ ఎంపీలు ఈ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాహుల్ మౌనం, ప్రియాంకా గైర్హాజరు..
అయితే, సభ బయట వక్ఫ్ బిల్లును తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సభలో మాత్రం చర్చ సందర్భంగా మాట్లాడకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అత్యంత ప్రతిష్టాత్మక బిల్లుపై కాంగ్రెస్ భావిభారత ప్రధాని అభ్యర్థిగా చూస్తున్న వ్యక్తి మాట్లాడకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. అంతకు కొన్ని రోజుల ముందు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ స్పీకర్‌పై ఆరోపణలు కురిపించారు. లోక్‌సభలో 12 గంటల పాటు సాగిన చర్చలో మాత్రం రాహుల్ గాంధీ తన వైఖరిని వినిపించలేదు.
కాంగ్రెస్ వక్ఫ్ బిల్లు ముస్లింలకు అన్యాయం చేస్తుందని ఆరోపిస్తుంది, వారి హక్కుల్ని హరిస్తుందని విమర్శిస్తుంది. అయితే, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ ఎంపీలు కూడా ఎలా హరిస్తుంది, నష్టం చేస్తుందనే విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పలేకపోవడం గమనార్హం. దీనికి తోడు వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ సభకు రాకపోవడంపై పలు ముస్లిం సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత కీలకమైన బిల్లు సభలోకి వస్తున్నప్పుడు గైర్హాజరు కావడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.
కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎమ్ఎల్) అనుకూల మలయాళ పత్రిక సుప్రభాతంలో వచ్చిన సంపాదకీయం.. బాబ్రీ సంఘటన తర్వాత ముస్లింలపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా అభివర్ణించింది. ప్రియాంకా గాంధీ ఎందుకు చర్చకు రాలేదని ప్రశ్నించింది. దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే బిల్లుపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. ఆర్ఎస్ఎస్ , బీజేపీ ముస్లింలను లక్ష్యంగా చేసుకుందని సంపాదకీయం ఆరోపించింది.
వ్యూహం ఏమిటి..?
ఈ బిల్లుపై బయటకు వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, సభలో మాత్రం అనుకున్న రీతిలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎండగట్ట లేకపోయింది. కాంగ్రెస్ సభ్యులు ప్రతీసారి మైనారిటీలకు అన్యాయం అని చెప్పారే తప్పితే, ఎలా అన్యాయం చేస్తుందనే విషయాన్ని సభ ముందు ఉంచలేకపోవడం గమనార్హం.
నిజానికి రాహుల్ గాంధీ మౌనంగా ఉండటానికి కారణం.. హిందూ ఓటర్లు మద్దతు కావచ్చు. 2014కు ముందు కాంగ్రెస్‌కి ఉన్న అనుకూల పరిస్థితులు ఇప్పుడు దేశంలో లేవు. ప్రతీ ఎన్నికలు ఏదైనా ఓడిపోవడమే కాంగ్రెస్ వంతు అవుతోంది. హిందూ ఓటర్ల మద్దతు తగ్గిపోతోంది.
వరసగా బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో సత్తా చాటాలంటే హిందూ ఓట్లు కూడా కీలకమే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ వక్ఫ్ బిల్లుపై పెద్దగా మాట్లాడలేదని తెలుస్తోంది. వక్ఫ్ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తే, ఎన్నికల్లో హిందూ ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, ఓ సెక్షన్ ఓటర్లు కాంగ్రెస్‌ని ప్రో-ముస్లింగా భావిస్తు్న్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు రాహుల్ గాంధీ సభలో ఒక వేళ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడితే దానిని తెగ వైరల్ చేసేందుకు బీజేపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా సిద్ధంగా ఉండటం కూడా మరో కారణం కావచ్చు.