“కోవిడ్-19” విపత్తు నేపథ్యంలో ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. “రెండవ విడత” కరోనా విపత్తులో దేశం విలవిల్లాడుతోందని..ఎలాగైనా సరే ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ప్రతి ఆరుగురి “కోవిడ్” బాధితుల్లో, ఒకరు భారతీయుడు ఉన్నాడని లేఖలో పేర్కొన్నారు. దేశ జనాభా, జనసాంద్రత నేపథ్యంలో వైరస్ శరవేగంగా అనేక రూపాంతరాలతో విజృంభిస్తోందని.. నియంత్రణ లేకుండా వైరస్‌ను వదిలేయడం వల్ల దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు అని పేర్కొన్నారు. వైరస్ రూపాంతరాలపై “జీనోమ్ సీక్వెన్సింగ్” విధానం ద్వారా అధ్యయనం చేయాలని… కొత్త వేరియంట్స్ పై ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావాన్ని పరీక్షించాలన్నారు. దేశ జనాభా మొత్తానికి మెరుపువేగంతో వ్యాక్సినేషన్ చేయాలని… మన అధ్యయనాల ఫలితాలను పారదర్శకంగా మిగతా ప్రపంచానికి తెలియజేయాలని తెలిపారు. ప్రభుత్వానికి స్పష్టమైన వ్యాక్సినేషన్ ప్రణాళిక లేదని..విజయం సాధించకుండానే సంబరాలు జరుపుకున్నారని ఫైర్ అయ్యారు. ఫలితంగా దేశం అత్యంత ప్రమాదభరిత స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలని.. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మా మద్ధతు ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ
