Site icon NTV Telugu

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి పెళ్లి ప్రతిపాదన.. ఒప్పుకుంటే ఆ అమ్మాయితోనే పెళ్లి

Rahul Gandhi Bharat Jodo Yatra

Rahul Gandhi Bharat Jodo Yatra

Rahul Gandhi get a marriage proposal during Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా బలోపేతం చేసే పనిలో ఉన్నారు రాహుల్ గాంధీ. తమిళనాడులో మొదలైన రాహుల్ యాత్ర.. నిన్న రాత్రి కేరళకు చేరింది. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. శనివారం తమిళనాడు కన్యాకుమారి జిల్లా మార్తాండమ్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుపెట్టారు. మార్తాండమ్‌లో మహిళా ఉపాధి హామీ కార్యకర్తలను కలుసుకున్నప్పుడు రాహుల్ గాంధీకి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. రాహుల్ గాంధీకి తమిళనాడుపై ఉన్న ప్రేమ గురించి తెలుసని.. అతడికి తమిళ అమ్మాయితో పెళ్లి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళలు అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మహిళలు, రాహుల్ గాంధీల మధ్య కాసేపు పెళ్లి ముచ్చట్లు నడిచాయి.

సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ మొదలైంది. దాదాపుగా 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా ఆయన యాత్ర సాగనుంది. కన్యాకుమారిలో ప్రారంభం అయిన పాదయాత్ర కాశ్మీర్ లో ముగుస్తుంది. 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. నిరుద్యోగం, ద్రవ్యోల్భనం వంటి అంశాలపై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సాగుతోంది రాహుల్ పాదయాత్ర. శనివారం రాహుల్ గాంధీ తన పాదయాత్రలో ఆసియాలోని ఫస్ట్ లేడీ బస్ డ్రైవర్ 63 ఏళ్ల వసంత కుమారిని కలుసుకున్నారు. మార్తాండమ్ లోని పారిశుద్ధ్య కార్మికులు, టీ స్టాల్ యజమాని ఇలా అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటున్నారు. విలేజ్ కుకింగ్ ఛానెల్ సభ్యులను కూడా కలిశారు రాహుల్ గాంధీ.

Read Also: Krishnam Raju: కన్నీరుమున్నీరవుతున్న మొగల్తూరు

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ పాదయాత్రపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రాహుల్ ధరించిన టీషర్టు గురించి బీజేపీ ట్వీట్ చేసింది. రూ.41,000 టీ షర్టు ధరించారని విమర్శించింది. దీంతో పాటు వివాదాస్పద ఫాదర్ జార్జ్ పొన్నయ్యను కలవడంపై కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో జార్జ్ పొన్నయ్య హిందువులు, ప్రధాని మోదీ, అమిత్ షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ దేశం ఒకటి కానది వ్యాఖ్యానించిన వ్యక్తి ఇప్పుడు భారతదేశాన్ని ఏకం చేయడానికి పాదయాత్ర చేస్తున్నాడంటూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ కూడా ధీటుగానే స్పందిస్తోంది. భారత్ జోడో యాత్రతో బీజేపీలో కలవరం మొదలైందని.. బీజేపీ భయపడుతోందని విమర్శిస్తోంది.

 

Exit mobile version