NTV Telugu Site icon

Bharat Jodo Yatra: కన్యాకుమారిలో భారత్‌ జోడో యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra:  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం సాయంత్రం 5గంటలకు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. త‌న ముందు పార్టీ సేవా ద‌ళ్‌ శ్రేణులు క‌దం తొక్కుతూ సాగ‌గా… రాహుల్ గాంధీ త‌న సుదీర్ఘ యాత్రను ప్రారంభించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీ చేతికి త్రివర్ణ పతాకాన్ని అందించారు. త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌, రాజ‌స్ధాన్ సీఎం అశోక్ గహ్లోత్‌, చ‌త్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ స‌హా ప‌లువురు నేత‌ల స‌మ‌క్షంలో గాంధీ మంట‌పం నుంచి పాద‌యాత్ర ప్రారంభించారు. రాహుల్ వెంట 59 ట్రక్కులతో పాటు 118మంది కాంగ్రెస్ నేతలు కూడా పయనమయ్యారు. మిలే క‌దం…జుడే వ‌త‌న్ నినాదంతో పాద‌యాత్ర నిర్వహిస్తున్నారు. ఇక పాద‌యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ క‌న్యాకుమారిలోని వివేకానంద మెమోరియ‌ల్‌ను సంద‌ర్శించారు. మ‌రోవైపు శ్రీపెరంబ‌దూర్‌లో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మార‌కం వ‌ద్ద నివాళి అర్పించారు. విద్వేష‌, విభ‌జ‌న రాజ‌కీయాల‌కు త‌న తండ్రి బ‌ల‌య్యాడ‌ని, కానీ అటువంటి విద్వేష రాజ‌కీయాల‌కు దేశాన్ని వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేన‌ని రాహుల్ ఇవాళ ట్విట్టర్‌లో తెలిపారు

మొత్తం 3,570 కిలోమీటర్లు, 150 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఐదు నెలల్లో 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ గాంధీ యాత్ర చేప‌ట్టడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోడో యాత్ర జోష్ వ్యక్తమ‌వుతోంది. కాగా..2024 సార్వత్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య‌మే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారు. మరోవైపు ఇది ఎన్నికల కోసం కాదని.. భారత్‌ను ఏకం చేయడానికి అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈ యాత్ర జమ్మూ కాశ్మీర్ లో ముగియనుంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం, పెట్రోల్ రేట్లు, నిరుద్యోగం, చైనా దురాక్రమణ వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రశ్నించనుంది. ఈ యాత్రంలో భాగంగా యాత్రలో పాల్గొనే వారు ఎక్కడా కూడా ఏ హోటల్లో బస చేయరు. వీరి కోసం ప్రత్యేకంగా కంటైనర్లను సిద్ధం చేశారు. మొత్తం 60 కంటైనర్లను ఏర్పాటు చేశారు. వీటిలోనే బెడ్లు, టాయిలెట్లు ఉండనున్నాయి. యాత్రలో పాల్గొనేవారు రోడ్డుపైనే భోజనం చేయడంతో ప్రజలతో మమేకం కానున్నారు. ప్రతీరోజు 6 నుంచి 7 గంటల పాటు యాత్ర కొనసాగనుంది. కన్యా కుమారి నుంచి ప్రారంభం అయిన యాత్ర తిరువనంతపురం, కొచ్చి, నిలంబూర్, మైసూరు, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్గావ్ జామోద్, ఇండోర్, కోట, దౌసా, అల్వార్, బులంద్‌షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్, జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల గుండా యాత్ర సాగనుంది. కేరళలో 18 రోజుల పాటు, కర్ణాటలో 21 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది.

Rajastan: మధ్యాహ్న భోజన కుంభకోణం.. హోంమంత్రికి చెందిన పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు

కాంగ్రెస్ పార్టీలో భారత్ జోడో యాత్ర సరికోత్త జోష్ ఇస్తుందని నేతలు భావిస్తున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్లు గడువు ఉండటంతో ఈ లోపు పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే వరస పరాజయాలు, నేతల తిరుగుబాట్లు, ప్రముఖుల పార్టీ మార్పులతో కాంగ్రెస్ పార్టీ ఢీలా పడింది. గత వైభవాన్ని తిరిగి పొందేందుకు ఈ భారత్ జోడో యాత్ర సహాయపడుతుంది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.