Site icon NTV Telugu

Rahul Gandhi: ఇలాంటి రాజకీయాలు చేయడానికి ప్రధాని మోదీకి సిగ్గు లేదా..?

Mp Rahul Gandhi

Mp Rahul Gandhi

Rahul Gandhi criticizes PM Narendra Modi: 2002లో గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేయడంతో పాటు మరో ఏడుగురిని చంపిన కేసులో నిందితులను విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ, గుజరాత్ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ.. తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇప్పటికే వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని విమర్శించారు. నారీ శక్తి గురించి ఎర్రకోట నుంచి ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన తర్వాత కొన్ని గంటలకే ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన నిందితులను వదిలేశారని..ప్రధాని మాటలకు, చేతలకు తేడా ఉంటుందని ప్రజలు గమనిస్తున్నారంటూ విమర్శించారు.

తాజాగా గురువారం మరోసారి రాహుల్ గాంధీ, ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. నేరస్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ మహిళల పట్ల ఉన్న గౌరవం ఏపాటిదో.. ఆ పార్టీ మనస్తత్వం ఎలా ఉందనే విషయాలను తెలియపరుస్తోందని విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు చేయడానికి ప్రధాని మోదీకి సిగ్గు లేదా..? అని ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్, హత్రాస్, జమ్మూ కాశ్మీర్ కథువా, గుజరాత్ బిల్కిస్ బానో అత్యాచారాలను ప్రశ్నించారు. ‘‘ఉన్నావ్ అత్యాచారంలో బీజేపీ ఎమ్మెల్యేను రక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. కథువాలో రేపిస్టులకు అనుకూలంగా ర్యాలీలు, హత్రాస్ లో రేపిస్టులకు అనుకూలంగా ప్రభుత్వం, గుజరాత్ లో రేపిస్టులకు గౌరవం. నేరస్తులకు మద్దతు ఇవ్వడంపై బీజేపీకి మహిళ పట్ట ఉన్న సంకుచిత మనస్తత్వాన్ని ప్రదర్శిస్తోంది’’ అని ట్విట్టర్ లో విమర్శించారు.

Read Also: Raju Srivatsav: ప్రముఖ కమెడియన్ ఆరోగ్యం విషమం.. బతికే ఛాన్స్ లేదు..?

బిల్కిస్ బానో హత్యాచార ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మాట్లాడుతూ.. నేరస్తుల విడుదల కోసం ఏర్పాటు చేసిన రిమిషన్ రివ్యూ ప్యానెల్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. రివ్యూప్యానెల్ లోని బీజేపీ ఎమ్మెల్యేలు సీకే రావోల్జి, సుమన్ చౌమన్ ఉన్నారని ట్విట్టర్ లో ఆరోపించారు. వీరే 11 మంది వ్యక్తులకు క్షమాభిక్షను మంజూరు చేశారని ఆరోపించారు.

2002లో జరిగిన గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానో అనే ఐదు నెలల గర్భిణిపై 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో పాటు ఆమె మూడేళ్ల కుమార్తెతో పాటు ఏడుగురిని హత్య చేశారు. ఈ హత్య కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు 2008లో నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది. బాంబే హై కోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. తాజాగా గుజరాత్ ప్రభుత్వం 75 ఏళ్ల వజ్రోత్సవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ 11 మందికి క్షమాభిక్ష ప్రసాదించింది. వీరంతా ఈ నెల 15న గోద్రా సబ్ జైలు నుంచి విడుదలయ్యారు.

Exit mobile version