Rahul Gandhi-Congress Party Presidential Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే పదవిని చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పార్టీ సీనియర్ లీడర్ల నుంచి.. సామాన్య కార్యకర్త వరకు రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు రాహుల్ గాంధీ అధ్యక్షుడు కావాలని ఏకగ్రీవం తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు తీర్మానాలు చేశాయి.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీనే చేపట్టాలని ఇప్పటి వరకు 7 రాష్ట్రాల యూనిట్లు తీర్మానాలు చేశాయి. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీపై ఒత్తడి పెంచేందుకు నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాజస్థాన్, చత్తీస్ ఘడ్, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. గతంలో 2017లో కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పదవిని చేపట్టాలని ఇలాగే రాష్ట్రాలు తీర్మానాలు చేశాయి. ఆ సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు. అయితే 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఆయన పదవికి రాజీనామా చేశారు.
Read Also: Mamata Benerjee: మోడీకి మద్దతుగా మమత కామెంట్స్.. ఆశ్చర్యంలో పార్టీ నేతలు
ఇక మరోవైపు పార్టీ అధ్యక్ష ఎన్నికల కోసం రంగం సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 22న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు తేదీలను ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8గా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అక్టోబర్ 17న ఎన్నిక, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో ఈ సారి కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు మాత్రం రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయితేనే క్షేత్రస్థాయిలోకి కాంగ్రెస్ వెళ్లే అవకాశం ఉంటుందని.. భావిస్తున్నారు.
