Site icon NTV Telugu

Rahul Gandhi: ఎనిమిదేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. ఎనిమిదేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దేశంలో వ్యక్తులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువల ధరలు విపరీతంగా పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీని వదులుతున్న తీరు నియంతృత్వ పాలనను ప్రతిబింభిస్తోందని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగంపై నిరసనకు తమ పార్టీ సిద్ధమవుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఏడు దశాబ్దాల్లో కాంగ్రెస్ సృష్టించింది.. కేవలం ఐదేళ్లలో నాశనం చేయబడిందని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఏకైక ఎజెండా ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయడమేనని రాహుల్ విమర్శించారు.

Congress Protests: నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు.. ఢిల్లీలో 144 సెక్షన్

నేషనల్ హెరాల్డ్​ కేసులో కాంగ్రెస్​ అగ్రనేతల్ని విచారించడంపై రాహుల్‌ గాంధీ స్పందించారు. తమను ఎంతైనా ప్రశ్నించుకోవచ్చని ఆయన అన్నారు. అసలు అక్కడ(హెరాల్డ్ కేసులో) ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడమే తన పని అని.. అందుకు ప్రతిగా తనపై దాడి చేసినా ఏమాత్రం తగ్గబోనని స్పష్టం చేశారు.వారు గాంధీ కుటుంబంపై ఎందుకు దాడి చేస్తారంటే.. తాము ఒక సిద్ధాంతం కోసం పోరాడతాం కాబట్టేనని ఆయన అన్నారు. తమలాంటి వారు కోట్ల మంది ఉన్నారన్నారు. తాము ప్రజాస్వామ్యం కోసం, సమాజంలో సామరస్యం కోసం పోరాడతామన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇలానే చేస్తున్నామన్న రాహుల్.. తమ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందన్నారు. రెండు వర్గాల మధ్య గొడవలు పెడుతుంటే, దళితుల్ని చంపేస్తుంటే, మహిళల్ని కొడుతుంటే చాలా బాధ కలుగుతుందన్నారు. అందుకే తాము పోరాడుతున్నామన్నారు.

నిరుద్యోగం, ధరల పెరుగుదల విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ ఆర్థిక రంగంలో అసలు ఏం జరుగుతుందో ఆమెకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఆమె రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిగా మాత్రమే ఉన్నారని విమర్శించారు. ఎన్నికల్లో భాజపా వరుస విజయాలపైనా తనదైన శైలిలో స్పందించారు. “హిట్లర్ కూడా ఎన్నికల్లో గెలిచేవాడు. ఎలా గెలిచాడు? జర్మనీలోని వ్యవస్థలన్నీ అతడి నియంత్రణలోనే ఉండేవి. నాకు వ్యవస్థ మొత్తాన్ని అప్పగించండి. ఎన్నికలు ఎలా గెలవాలో నేను చూపిస్తా” అని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ.

ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దుర్మార్గంగా దాడి చేస్తారని, జైల్లో పెడతారని.. ప్రజల సమస్యలను లేవనెత్తడానికి అనుమతించడం లేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదన్న ఆయన.. నలుగురి నియంతృత్వంలో ఉందని ఆరోపించారు. బడా వ్యాపారవేత్తల కోసమే ఈ సర్కారు పని చేస్తోందని ఆయన విమర్శించారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వస్తు సేవల పన్ను లేదా జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇవాళ నిరసనలు చేపట్టింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు కవాతు నిర్వహించాలని పార్టీ నాయకులు యోచిస్తున్నారు, కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లు దేశవ్యాప్తంగా ఇదే విధమైన నిరసనలు నిర్వహించనున్నాయి. ప్రధానమంత్రి ఇంటి ముట్టడిలో సీడబ్ల్యూసీ మెంబర్లు, జాతీయ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు. నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా అనుమతించలేమని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ తప్ప మిగతా ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. ఏఐసీసీ కార్యాలయం వద్ద బారికేడ్లతో పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. రాహుల్‌ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

Exit mobile version