NTV Telugu Site icon

Bharat Jodo Yatra: మరికొన్ని గంటల్లో షురూ.. షెడ్యూల్ ఇదే!

Bharat Jodo Yatra Schedule

Bharat Jodo Yatra Schedule

Rahul Gandhi Bharat Jodo Yatra Schedule Timings: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు.. 12 రాష్ట్రాలను కలుపుతూ మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. తొలుత రాహుల్ గాంధీ రేపు ఉదయం 7 గంటలకు శ్రీ పెరంబదూర్‌లో రాజీవ్ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. తర్వాత కన్యాకుమారి చేరుకుని.. కామరాజ్ నాడార్, మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. 3 గంటలకు వివేకానంద రాక్ మెమొరియోల్, కామ్ రాజ్ మెమోరియల్, తిరివళ్లూర్ మెమోరియల్‌కు చేరుకొని.. ప్రార్థనలు నిర్వహించనున్నారు. మహాత్మాగాంధీ మండపం వద్ద నివాళులు అర్పించే సమయంలో.. తమిళనాడు సీఎం స్టాలిన్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్, రాజస్థాన్ సీఎం గెహ్లాట్‌లు రాహుల్ గాంధీకి జాతీయ జెండాను అందిస్తారు. గాంధీ మండపం వద్దనున్న బీచ్ రోడ్‌లో సాయంత్రం 5 గంటలకు పబ్లిక్ మీటింగ్‌ని భారీఎత్తున నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌కు పార్టీ సీనియర్ నేతలతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరు కానున్నారు.

మీటింగ్ ముగిసిన తర్వాత.. భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 7 గంటలకు వివేకానంద పాలిటెక్నిక్ కాలేజ్ నుండి ఈ భారత్ జోడో యాత్ర షురూ కానుంది. ప్రతిరోజు కనీసం 20 నుంచి 24 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. ఉదయం 7:00 గంటల నుంచి 10:30 గంటల వరకు నిర్విరామంగా పాదయాత్ర చేస్తారు. అనంతరం 3:30 గంటల వరకు విరామం తీసుకోనున్నారు. మళ్లీ 3:30 నుంచి 7:30 వరకు రాహుల్ పాదయాత్ర చేస్తారు. ఇలా 150 రోజుల వరకు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా మొత్తం 3,570 కిలోమీటర్లు నడిచి.. కశ్మీర్‌కు చేరుకోనున్నారు రాహుల్ గాంధీ. ‘ఏక్ తేరా కదమ్, ఏక్ మేరా కదమ్, మిల్ జాయే జుడ్ జాయే అప్నా వతన్’ నినాదంతో సాగనున్న ఈ పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ స్థానిక ప్రజల్ని కలుస్తూ.. పాదయాత్ర ఎందుకు చేస్తున్నానో వివరించనున్నారు. 117 మందితో కూడిన రాహుల్ గాంధీ టీమ్ ఈ భారత్ జోడో యాత్రలో పాల్గొననుంది.