Site icon NTV Telugu

INDIA Bloc-EC War: ఇండియా కూటమి మార్చ్‌లో ఉద్రిక్తత.. రాహుల్‌గాంధీ అరెస్ట్

Rahulgandhiarrest

Rahulgandhiarrest

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీసుకు ర్యాలీ చేపట్టారు. విపక్ష ఎంపీలంతా ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో నేతలు-పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంకోవైపు అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఎంపీలు బారీకేడ్లు దూకుకుంటూ వెళ్లిపోయారు. పరిస్థితులు చేదాటిపోవడంతో రాహుల్‌గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలోకి ఎక్కించారు.

పార్లమెంట్ భవనం నుంచి ఈసీ ఆఫీసు కిలోమీటర్ దూరంలో ఉంది. సోమవారం ఉదయం ఈసీ ఆఫీసుకు ఇండియా కూటమి ర్యాలీగా బయల్దేరింది. దేశంలో ఓట్లు చోరీ జరుగుతుందంటూ కూటమి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు బయల్దేరింది. అయితే పార్లమెంట్ చుట్టూ పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ర్యాలీగా వెళ్లకుండా అష్టదిగ్బంధం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా 65 లక్షల ఓట్లను తొలగించింది. దీంతో విపక్షాలు ధ్వజమెత్తాయి. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం ఓట్లు తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండిస్తోంది. తనిఖీలు చేశాకే ఓట్లు తొలగించినట్లు చెప్పింది. ఇక ఇటీవల గత లోక్‌సభ ఎన్నికల్లో మోసం జరిగిందంటూ కర్ణాటకలో జరిగిన ఘటనను రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. అయితే దీనిపై రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది. అయితే తాము అడిగిన సమాచారం ఇవ్వాలంటూ తాజాగా ఈసీ ఆఫీస్‌కు మార్చ్ చేపట్టారు.

 

 

Exit mobile version