ఎన్నో ఆశలతో న్యూజిలాండ్ వెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టు రిక్త హస్తాలతో స్వదేశానికి వచ్చేస్తోంది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆదివారం నాడు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలై.. తద్వారా వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ టీమ్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఓడినప్పటికీ చివరి వరకూ మన మహిళలు పోరాడిన తీరు అద్భుతమని రాహుల్ గాంధీ కొనియాడారు. ప్రపంచకప్ వేటలో మహిళల జట్టు వెనుకబడినా.. వారిలో క్రీడా స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదని అభిప్రాయపడ్డారు. మన మహిళలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.
కాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత మహిళలు మంచి స్కోరు సాధించినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయారు. చిట్టచివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అద్భుత విజయాన్ని సాధించింది. ఒత్తిళ్లను ఎదుర్కొని విజేతగా ఆవిర్భవించింది. చివరి ఓవర్‌లో నోబాల్ పడటం ఆ జట్టుకు కలిసొచ్చింది. నో బాల్‌తో ఒక పరుగు, ఒక బంతి ఎక్స్‌ట్రాగా లభించడాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్లు వినియోగించుకున్నారు.
