Site icon NTV Telugu

Uttar Pradesh: రాహుల్ గాంధీ-అఖిలేష్ యాదవ్ సభలో తొక్కిసలాట.. కార్యకర్తల మధ్య ఘర్షణ..

Aksilesh

Aksilesh

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రయాగ్ రాజ్‌లో జరగాల్సిన కాంగ్రెస్-సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీల ఎన్నికల ర్యాలీ రసాభసాగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కార్యకర్తల అత్యుత్సాహంతో తొక్కిసలాట జరిగింది. దీంతో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ప్రసంగించకుండానే సభ వేదిక నుంచి వెళ్లిపోయారు. ఒక్కసారిగా గుంపులు గుంపులుగా కార్యకర్తలు బహిరంగ సభ వేదిక వద్దకు దూసుకువచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో భద్రతకు ఇబ్బంది కావడంతో ఇరువురు నేతలు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Read Also: Indian 2: స్టార్ స్పోర్ట్స్‌లో ‘భార‌తీయుడు 2’ ప్రమోషన్స్…ఆడియో లాంచ్ ఆరోజే

ప్రయాగ్ రాజ్ జిల్లాలోని ఫుల్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని పాడిలాలో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు అదుపు తప్పి వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పార్టీ కార్యకర్తలు శాంతించాలని, సంయమనం పాటించాలని అఖిలేష్, రాహుల్ పదేపదే అభ్యర్థించినప్పటికీ, కార్యకర్తలు వీటిని పట్టించుకోలేదు. కార్యకర్తలనను అదుపు చేసేందుకు పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఫుల్‌పూర్ ర్యాలీ నుంచి ఇరువురు నేతలు అలహాబాద్ ఎంపీ పరిధిలోని కరాచానాలోని ముంగారి వద్దకు వెళ్లారు. ఈ ర్యాలీలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. జనం బారికేడ్లు బద్దలు కొట్టి వేదిక పైకి చేరుకునేందుకు ప్రయత్నించారు.

ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీనే ఢిల్లీ సింహాసానాన్ని అధిష్టిస్తుంది. గత రెండు పర్యాయాలుగా ఈ రాష్ట్రం నుంచి బీజేపీ మెజారిటీ స్థానాలను సాధించింది. ఈ సారి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్-ఎస్పీలు పొత్తులో పోటీ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మే 20 రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీతో పాటు అమేథీకి ఎన్నికలు జరగనున్నాయి.

Exit mobile version