NTV Telugu Site icon

నేడు పుష్కర్ సింగ్ ధామియా ప్రమాణస్వీకారం

Pushkar Singh Dhami

Pushkar Singh Dhami

ఉత్తరాఖండ్‌ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు పుష్కర్‌ సింగ్‌ ధామి..! 45 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పీఠం అందుకోబోతున్నారు. ఆరెస్సెస్‌ దాని అనుబంధ సంఘాల్లో 33 ఏళ్ల పాటు సేవలు అందించిన పుష్కర్‌ సింగ్‌.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..! అయితే సీఎం పీఠం అందుకోబోతున్న ఆయనకు సవాళ్లు అదే స్థాయిలో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా, ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రుల మార్పు ఆసక్తికరంగా మారింది. నాలుగు నెలల్లోనే మూడో వ్యక్తి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తీరత్‌ సింగ్‌ రాజీనామా చేయడంతో బీజేపీ అధిష్టానం పుష్కర్‌ సింగ్‌ను సీఎంగా ప్రకటించింది. ఆయన్ను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. పుష్కర్‌ సింగ్‌ది ఉధమ్‌ సింగ్‌ నగర్‌ జిల్లాలోని ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గం..! ఇక్కడి నుంచి ఆయన 2012, 2017 వరుసగా రెండు సార్లు గెలిచారు.

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు. 1975 సెప్టెంబరు 16న పితోడ్‌గఢ్‌లోని కనాలిచిన్నా ప్రాంతంలో జన్మించారు. 2002లో లఖ్‌నవూ యూనివర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. దాదాపు 33 ఏళ్ల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంఘాల్లో సేవలు అందించారు. ఏబీవీపీలో పదేళ్ల పాటు పని చేశారు. 2002 నుంచి 2006 మధ్య BJP రాష్ట్ర జనతా యువ మోర్చాకు అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భగత్‌ సింగ్‌ కోశ్యారీకి ఓఎస్డీగా పనిచేశారు. ఉత్తరాఖండ్‌లో ఓటు పడాలంటే మూడే మూడు అంశాలు కీలకంగా పని చేస్తాయి. మొదటిది.. కుమోన్‌ వర్సెస్‌ గర్వాల్‌ ప్రాంతాలు.. రెండోది ఠాకూర్‌ వర్సెస్‌ బ్రాహ్మిన్‌.. మూడోది పర్వత ప్రాతాలు వర్సెస్‌ మైదాన ప్రాంతాలు..! ధామి ఠాకూర్‌ కమ్యూనిటీకి చెందిన వాడు. పైగా పర్వత ప్రాంతం నుంచి ప్రతినిధ్యం వహిస్తున్నాడు. తీరత్‌ సింగ్‌ ఠాకూర్‌ కమ్యూనిటీకే చెందిన వాడైనా.. గర్హాల్‌ నుంచి ప్రతినిథ్యం వహిస్తున్నాడు. దీంతో కుల, ప్రాంత రాజకీయ సమీకరణాలను లెక్కేసుకుని ధామిని సీఎంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే చిన్న వయసులోనే సీఎం పగ్గాలు అందుకోబోతున్న పుష్కర్‌ సంగ్‌కి.. అనేక సవాళ్లు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. పార్టీలో అందరు నేతలను సర్థుబాటు చేసుకుని.. ముందుకు సాగాల్సి ఉంటుంది. పైగా సమయం తక్కువగా ఉంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పుష్కర్‌ సింగ్‌ ఎలా ముందుకెళ్తారన్నదే ఆసక్తికరంగా మారింది.