NTV Telugu Site icon

Punjab Minister: దూకుడుగా ప్రవర్తించిన మంత్రి.. అవమానంగా భావించి వైస్ ఛాన్సలర్ రాజీనామా

Punjab Health Minister

Punjab Health Minister

Punjab Minister: పంజాబ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఫరిద్‌కోట్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లో అపరిశుభ్రతపై ఆరోగ్య మంత్రి చేతన్‌ సింగ్ జౌరమజ్రాకు ఫిర్యాదులు అందాయి. దానిపై మీడియాతో కలిసి ఆయన గురు గోవింద్‌సింగ్ మెడికల్ కాలేజ్‌, ఆస్పత్రిని సందర్శించారు. ఆ సమయంలో ఆయన వెంటే బాబా ఫరిద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌ సైన్సెన్‌ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్ రాజ్‌ బహదూర్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఆ ఆసుపత్రి వాతావరణం చూసిన మంత్రి ఆగ్రహానికి గురై.. బహదూర్‌తో మంత్రి చేతన్‌ సింగ్ జౌరమజ్రా కాస్త దూకుడుగా ప్రవర్తించారు. ‘ఇదంతా మీ చేతిలోనే ఉంటుంది’ అంటూ వైస్‌ఛాన్సలర్‌ను ఆసుపత్రి బెడ్‌పై పడుకోమన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురి మధ్య కెమెరా ఎదుట జరిగిన ఈ చర్యను ఆ వైద్యాధికారి తీవ్ర అవమానంగా భావించారు. శుక్రవారం ఈ ఘటన జరగగా.. ఇవాళ ఆయన ప్రభుత్వానికి రాజీనామా లేఖ పంపారు.

మంత్రి చర్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. వైస్‌ ఛాన్సలర్‌ పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర అవమాకరమైందని, ఇది వైద్య వృత్తిని అగౌరవపర్చడమేనని నిరసించింది భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మంత్రిని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి డిమాండ్ చేశాయి. ఈ ఘటనను ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నేత పర్తాప్‌ సింగ్‌ బజ్వా ఖండించారు. “పంజాబ్ ముఖ్యమంత్రి, ప్రజల దృష్టిలో మంత్రి యొక్క ఈ అనాలోచిత ప్రవర్తనను తీవ్రంగా పరిగణించాలి. అతనికి మార్చింగ్ ఆదేశాలు ఇవ్వాలి. ఇంకా, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చిత్తశుద్ధితో ఆలోచించి, ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఆప్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల్లో ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరును చెడగొట్టకుండా ఉండండి” అని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. మరో సీనియర్ కాంగ్రెస్ నేత గుర్జీత్ సింగ్ ఔజ్లా కూడా ఆరోగ్య మంత్రిని బర్తరఫ్ చేయాలని పంజాబ్ సీఎంను కోరారు. “భగవంత్ మాన్‌జీ, ఆరోగ్య మంత్రి బలహీనమైన మనస్తత్వం, రాజకీయ దివాళాకోరుతనం ఫలితంగా సీనియర్ వైద్యుల నిరసన రాజీనామాలు ఉన్నాయి. మంత్రి చర్యలపై వెంటనే నోటీసు ఇవ్వాలని నేను సూచిస్తున్నాను. మా వైద్యులందరూ గౌరవానికి అర్హులు.” అని ఔజ్లా ట్వీట్ చేశారు. శిరోమణి అకాలీదళ్ నేతలు కూడా రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాలని కోరారు.

కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఈ ఘటనను ఖండించారు. “యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌ సైన్సెన్‌ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్ రాజ్‌ బహదూర్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు ఆరోగ్య మంత్రిని భర్తరఫ్ చేయాలని.. ఆ వైస్ ఛాన్సలర్ రాజీనామాను ఉపసంహరించుకోవడంతో పాటు ఆ వైద్యుడికి క్షమాపణలు చెప్పాలని సీఎం భగవంత్ మాన్‌ను కోరుతున్నాను. ఈ ఘటన పంజాబ్‌లో ఆరోగ్య సేవలను దెబ్బతీస్తుంది.” అని కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ట్వీట్ చేశారు.

పంజాబ్ ఆరోగ్య మంత్రి జౌరమజ్రా, బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్-ఛాన్సలర్‌ను మురికిగా ఉన్న పరుపుపై ​​పడుకోమని ఆదేశిస్తున్న వీడియో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రుల దుస్థితిపై మంత్రి ఆయనపై విరుచుకుపడ్డారు.