Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ

Punjab Asi

Punjab Asi

Punjab Police Controversy: పంజాబ్‌లోని ఖన్నాలో సంచలనం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ శివసేన నాయకుడిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు పోలీసు సిబ్బందికి చెందిన ఓ ఏఎస్ఐ (ASI) ఆయన ఇంట్లోని పరుపు కింద హెరాయిన్ పెట్టి అడ్డంగా బుక్కయ్యారు. ఆ తర్వాత పోలీసులు అదే గదిలో తనిఖీలు నిర్వహించి హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించి, శివసేన నాయకుడు మహంత్ కశ్మీర్ గిరిని అరెస్ట్ చేశారు. అయితే ఇంట్లో ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలో రికార్డైన దృశ్యాలు బయటకు రావడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

ఆ వీడియోలో పోలీసు బృందం రాకముందే సాధారణ దుస్తుల్లో ఓ ఏఎస్ఐ గదిలోకి ప్రవేశించి, పరుపు కింద ఏదో వస్తువు ఉంచినట్లు కనిపిస్తోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఖన్నా ఎస్ఎస్పీ డాక్టర్ దర్పణ్ అహ్లువాలియా తక్షణ చర్యలు చేపట్టారు. సంబంధిత ఏఎస్ఐ సుఖ్‌దేవ్ సింగ్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. మహంత్ కశ్మీర్ గిరిని కూడా కేసు నుంచి విడుదల చేశారు.

అసలు ఏం జరిగింది?

పంజాబ్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి వ్యతిరేకంగా పోలీసులు చర్యలు చేపడుతున్న సమయంలో ఖన్నాలో ఈ ఘటన వెలుగుచూసింది. ఖన్నాలోని ఖతీకా చౌక్ సమీపంలో నివసించే శివసేన నాయకుడు మహంత్ కశ్మీర్ గిరి ఇంట్లో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహంత్ కశ్మీర్ గిరి డ్రైవర్ గుర్జంట్ సింగ్ జంటాను తొలుత 7.5 గ్రాముల హెరాయిన్‌తో అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అతడిని విచారించిన తర్వాత మహంత్ కశ్మీర్ గిరి పేరు బయటకు వచ్చిందని, అనంతరం ఆయన ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు మొదట వెల్లడించారు.

అయితే ఇంట్లోని రహస్య కెమెరా రికార్డింగ్‌లో పోలీసు బృందం రాకముందే సీఐఏ స్టాఫ్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ సుఖ్‌దేవ్ సింగ్ సాధారణ దుస్తుల్లో ఇంట్లోకి వచ్చినట్లు కనిపించింది. అతను గదిలోకి వెళ్లి పరుపు కింద ఏదో ఉంచినట్లు వీడియోలో రికార్డైంది. ఈ ఘటన జరిగిన కొంతసేపటి తర్వాత సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్‌పాల్ సింగ్, సిటీ పోలీస్ స్టేషన్-2 ఇన్‌ఛార్జ్ తరవిందర్ కుమార్ బేడీతో పాటు ఇతర పోలీసులు మహంత్ కశ్మీర్ గిరిని తీసుకుని అదే గదికి చేరుకున్నారు. తనిఖీల సమయంలో పరుపు కింద సుమారు 30 గ్రాముల హెరాయిన్ లభించినట్లు పోలీసులు ప్రకటించారు. అనంతరం మహంత్ కశ్మీర్ గిరిని అరెస్ట్ చేశారు. అయితే రహస్య కెమెరా వీడియో బయటకు రావడంతో ఈ స్వాధీనం ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల చర్యలపై ప్రశ్నలు తలెత్తాయి.

ఏఎస్ఐ సస్పెండ్.. విచారణకు ప్రత్యేక బృందం

రహస్య కెమెరా రికార్డింగ్ బయటకు వచ్చిన వెంటనే ఖన్నా ఎస్ఎస్పీ డాక్టర్ దర్పణ్ అహ్లువాలియా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్ఐ సుఖ్‌దేవ్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపేందుకు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. అలాగే మహంత్ కశ్మీర్ గిరిని కేసు నుంచి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.