NTV Telugu Site icon

IAS Puja khedkar: మరో కొత్త వివాదంలో పూజా.. దొంగను వదిలిపెట్టాలంటూ ఏం చేసిందంటే..!

Ias Puja

Ias Puja

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తవ్వేకొద్దీ ఆమె బండారం బయటడుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి.. వేటు వేయించుకున్న ఆమె.. కొత్త కొత్త చిక్కుల్లో ఇరుక్కుంటోంది. ఇప్పటికే కంటి చూపు, మానసిక వైకల్యంతో పాటు ఓబీసీ సర్టిఫికెట్ విషయంలో నకిలీలు సృష్టించి ఉద్యోగం పొందినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా నవీ ముంబై పోలీసులు.. మహారాష్ట్ర హోంశాఖకు కీలక రిపోర్టును అందజేశారు. ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యుడ్ని విడుదల చేయాలంటూ పోలీసులపై పూజా ఖేద్కర్ తీవ్ర ఒత్తిడి చేసిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లు సమాచారం. పూజా.. మే 18న డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌కి ఫోన్ చేసి… దొంగిలించబడిన స్టీల్‌ను రవాణా చేస్తున్నాడని అనుమానిస్తున్న వ్యక్తిని విడిచిపెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ఈశ్వర్ అనే వ్యక్తి నిర్దోషి అని.. అతనిపై వచ్చిన అభియోగాలు చాలా చిన్నవిని ఆమె చెప్పుకొచ్చింది. కానీ పోలీసులు మాత్రం దొంగను విడిచిపెట్టలేదు.

2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ పూణె జిల్లాకు అసిస్టెంట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ట్రైనీగా ఉంటూ గొంతెమ్మ కోర్కెలు కోరింది. దీంతో ఆమెపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు వెళ్లడంతో పూజా కుటుంబ సభ్యుల ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇక ఆమె తల్లి మనోరమా.. అయితే ఒక రైతును తుపాకీతో బెదిరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అలాగే పూజా వాడిన కారుకి 21 ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా తేలింది. 27,000 జరిమానా చెల్లించాలని పోలీసులు నోటీసు జారీ చేశారు. ఇక అదనపు కలెక్టర్‌ అజయ్‌ మోర్‌ లేని సమయంలో ఆయన కార్యాలయాన్ని కూడా ఆమె ఉపయోగించారు. ఇక ఆమెపై ఆరోపణలు నిజమని తేలితే ఉద్యోగం పోయే పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా క్రిమినల్ కేసులు ఎదుర్కొనే దుస్థితి నెలకొంది.