మాతృభాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక అభివృద్ధికి దోహద పడుతుందని పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో బోధన కొనసాగుతోందన్నారు. వైద్య, సాంకేతిక కోర్సులు సైతం మాతృభాషలో బోధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతిపాదించిన కార్యక్రమాల అమలుపైనా వెబినార్‌లో మోదీ ప్రసంగించారు. విద్యాశాఖకు సంబంధించి ఐదు అంశాలపై దృష్టిసారించినట్లు తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర బడ్జెట్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జాతీయ డిజిటల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం.. విద్యా రంగంలో అపూర్వ ఘట్టమని ప్రధాని మోదీ అభివర్ణించారు.
