ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు సందర్శిస్తు్న్నారు. ప్రపంచ దేశాల నుంచి సైతం భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. కోట్లాది మంది కుంభమేళాలో పాల్గొంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు(ఫిబ్రవరి 5) కుంభమేళాను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రయాగ్ రాజ్ కు చేరుకుని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి గంగామాతకు ప్రార్థనలు చేస్తారని పీఎంఓ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ప్రధానమంత్రి పర్యటించే ప్రాంతాలను ఎన్.ఎస్.జి. స్వాధీనం చేసుకుంది. ఆయా ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా బలగాలు మోహరించాయి. గంగా ఘాట్ల భద్రతను పెంచారు. నగరం నుంచి కుంభ్ నగరం వరకు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రులు కూడా ప్రధానితో పాటు వెళ్లనున్నారు. కాగా జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.