President’s flag: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రేపు ఆదివారం (జూలై 31న) తమిళనాడు పోలీసులకు ప్రెసిడెంట్స్ ఫ్లాగ్‌ను అందజేయనున్నారు. ఈ కార్యక్రమం చెన్నైలోని రాజారత్నం స్టేడియంలో జరగనుంది. ఇందులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రెసిడెంట్స్ ఫ్లాగ్ అంటే ఏంటనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రెసిడెంట్స్ ఫ్లాగ్‌ని ప్రెసిడెంట్స్ కలర్ అవార్డ్ అని కూడా అంటారు. దీన్నే ‘నిషాన్’గానూ పేర్కొంటారు. ఇదో అరుదైన చిహ్నం/బ్యాడ్జ్/ఫ్లాగ్/ఎంబ్లం/మార్క్/కలర్.
ఈ ప్రత్యేక పురస్కారం వరించటాన్ని అత్యున్నత గౌరవంగా భావిస్తారు. దేశానికి అత్యుత్తమ సేవలందించిన బలగాలకు ఇస్తుంటారు. ఇది.. మిలటరీ లేదా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత పోలీసులు ధరించే ఒక డెకరేషన్. తొలిసారిగా 1951లో ఈ అవార్డును ఇవ్వటం ప్రారంభించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల పోలీసు విభాగాలకు ఈ పురస్కారాన్ని బహూకరించారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. దీనికి అర్హత సాధించాలంటే కనీసం పాతికేళ్లపాటు సేవలందించి ఉండాలి. ఈ అవార్డును గతంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, కేంద్రమంత్రి అందించారు.
Top-3: టాప్-3 కంపెనీలు.. టాప్-3 సంపన్న మహిళలు..
తమిళనాడుకు 2009లోనే పురస్కారాన్ని ప్రకటించారు. కానీ ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి బహుకరించలేదు. ఈ వేడుక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. గతంలో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఇవ్వాలనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. మొన్న 22వ తేదీన కూడా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి చేతుల మీదుగా అందించాలని భావించారు. ఎట్టకేలకు రేపు ఆదివారం ఈ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఫ్లాగ్‌ని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు ఉపరాష్ట్రపతి నుంచి స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర పోలీస్ విభాగంలో మొత్తం లక్షా 31 వేల 491 మంది పోలీసులు ఉన్నారు.
ఐపీఎస్ ఆఫీసర్ మొదలుకొని కానిస్టేబుల్ వరకు ప్రతిఒక్కరూ ఈ ఫ్లాగ్‌ని తమ యూనిఫాంలో భాగంగా ధరిస్తారు. ఈ మేరకు ప్రత్యేక యూనిఫాంని రూపొందించారు. ఈ అవార్డును చివరిసారిగా గతేడాది అస్సాం పోలీసులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బహూకరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ తరఫున ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు తొలిసారిగా 2019లో గుజరాత్ పోలీసులకు ప్రెసిడెంట్స్ ఫ్లాగ్‌ను అందజేశారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకి ప్రత్యేక ప్రెసిడెంట్స్ కలర్ బ్యాడ్జ్‌లు ఉన్నాయి.