NTV Telugu Site icon

Maha Kumbh Mela: వామ్మో.. ట్రాఫిక్ నరకం.. 300 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు

Mahakumbhmela112

Mahakumbhmela112

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు అత్యంత భారీగా భక్తులు పోటెత్తారు. తాజాగా మహా కుంభమేళాకు ఊహించని రీతిలో తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. కనీసం కాలు తీసి కాలు వేయలేనంతగా భక్తులు తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలివచ్చారు. దీంతో వారణాసి, కన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఇక ఆదివారం సెలవు దినం కావడంతో ఊహించని విధంగా భక్తులు తరలి రావడంతో రహదారులన్నీ వాహనాలతో.. భక్తులతో కిక్కిరిపోయింది. ఇలా దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులకు నరకం కనిపిస్తోంది. అటు వెనక్కి వెళ్లలేని పరిస్థితి… ఇటు ముందుకు వెళ్లాలని పరిస్థితి దాపురింది. తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోవడంతో.. తాగేందుకు నీళ్లు దొరకకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులైతే తీవ్ర కష్టాల పడుతున్నారు. తగిన విశ్రాంతి లేకపోవడంతో నీరసించి పోతున్నారు. కొనేందుకు కూడా ఆహార పదార్థాలు దొరకడం లేదని భక్తులు వాపోతున్నారు. ఇలా దాదాపు 48 గంటల నుంచి భక్తులు తంటాలు పడుతున్నారు.

ప్రస్తుతం ట్రాఫిక్ క్యూ 300 కిలోమీటర్లు ఉంటుందని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎక్కడికక్కడే జనజీవనం స్తంభించిపోయింది. ఎటూ కదలలేని పరిస్థితి దాపురించింది. ఇక యూపీకి వెళ్లే వాహనాలను మధ్యప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో నిలిపివేశారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారు. కేవలం 50 కి.మీ ప్రయాణానికి దాదాపు 12 గంటల సమయం పడుతుందని పోలీసలు చెబుతున్నారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్‌ను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం స్టేషన్‌లోంచి బయటకు రాలేని పరిస్థితి.. లోపలికి వెళ్లలేని పరిస్థితి దాపురించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రయాగ్‌రాజ్ జంక్షన్ స్టేషన్‌ సేవలు నిలిపివేసినట్లు లక్నో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (నార్తర్న్ రైల్వే) కుల్దీప్ తివారీ తెలిపారు.

ఇక ట్రాఫిక్ సమస్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తు్న్నాయి. యోగి ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తుతున్నాయి. తాజాగా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ట్వీట్ చేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.