Karnataka CM: కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, హైకమాండ్ బుజ్జగింపులకు తాజాగా ముగింపునకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే సీఎం మారుతారనే బలమైన లీకులు కాంగ్రెస్ అధిష్టాన వర్గాల నుంచి అందుతున్నాయి. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యను గౌరవప్రదంగా పక్కకు తప్పుకోవాలని, ఉపముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే తెరవెనుక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. గతంలో రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల వల్ల పార్టీ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. కర్ణాటకలో అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే అధిష్టానం ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
సిద్ధరామయ్యను అతివిశ్వాసమే దెబ్బ కొట్టిందా
77 ఏళ్ల సీనియర్ నేత సిద్ధరామయ్యకు ఎమ్మెల్యేలపై ఉన్న పట్టు, వెనుకబడిన వర్గాల మద్దతు తనను పదవి నుంచి దించలేవనే నమ్మకాన్ని కలిగించాయి. అయితే అదే ఆయన చేసిన రాజకీయ తప్పిదమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో సగం ముగిసేసరికి, కర్ణాటక పవర్ పాలిటిక్స్ బెంగళూరు నుంచి ఢిల్లీకి మారాయి. సిద్ధరామయ్య తన అనుచరులైన సీనియర్ మంత్రులు ఎం.బి.పాటిల్, జి. పరమేశ్వర, సతీష్ జార్కిహోళి, హెచ్.సి. మహదేవప్ప, కె.జె. జార్జ్ వంటి వారితో ఢిల్లీలో వ్యూహాత్మక సమావేశాలు జరిపినప్పటికీ, బలమైన కౌంటర్ స్ట్రాటజీని నిర్మించడంలో ఫెయిల్ అయ్యారని చెబుతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీతో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం తనను కాపాడుతుందని సిద్ధరామయ్య అనుకున్నారని, కానీ, గత ఆరు నెలలుగా సిద్ధరామయ్య కేవలం పాలనపైనే దృష్టి పెట్టగా, డీ.కే. మాత్రం హస్తినా పెద్దలతో నిరంతరం సత్ససంబంధాలు కొనసాగిస్తూ వచ్చారని చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న బహిరంగ విమర్శలు జాతీయస్థాయిలో పార్టీ పరువు తీస్తున్నాయని, దీంతో ఈ విమర్శలకు త్వరగా ఒక కచ్చితమైన ముగింపు పలకాలని హైకమాండ్ అభిప్రాయానికి వచ్చిందని చెబుతున్నారు.
గెలిచిన డీ.కే.. సిద్ధరామయ్య ఔట్
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న డీ.కే.శివకుమార్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సిద్ధరామయ్య అనుచరులు ముఖ్యమంత్రి మార్పును బహిరంగంగా తోసిపుచ్చినప్పటికీ, డీ.కే. మాత్రం ఎక్కడా నోరు జారలేదు. తానొక క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తనని, పార్టీ నిర్ణయాన్ని తూచ తప్పకుండా పాటించే కార్యకర్తను అని అధిష్టానం ముందు ప్రొజెక్ట్ చేసుకున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో నిరంతరం టచ్‌లో ఉంటూ.. 2023లో సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇచ్చినప్పుడు తనకు చేసిన ‘రహస్య ఒప్పందాన్ని’ (పవర్ షేరింగ్ ఫార్ములా) గుర్తు చేస్తూ వచ్చారు. బీజేపీ విమర్శలను తిప్పికొడుతూనే, తన వర్గం నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు కొట్టేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజాగా ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కె.సి.వేణుగోపాల్‌లతో సిద్ధరామయ్య, డీ.కే.శివకుమార్ విడివిడిగా సుదీర్ఘ సమావేశాలు జరిపారు. పైకి రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల గురించే చర్చలు జరిగాయని చెప్తున్నప్పటికీ.. అంతర్గతంగా కర్ణాటక సీఎం మార్పుపైనే ప్రధానంగా చర్చ సాగినట్లు సమాచారం. సిద్ధరామయ్యకు కేంద్రంలో పెద్ద పదవి ఇవ్వడం లేదా రాజ్యసభకు పంపి గౌరవప్రదమైన వీడ్కోలు పలకాలని హైకమాండ్ భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి. ఇక్కడ గ్రూపు రాజకీయాల వల్ల పాలన కుంటుపడితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి కోలుకోలేని నష్టం జరుగుతుందని ఢిల్లీ పెద్దలు భయపడుతున్నారు. డీ.కే.శివకుమార్‌కు ఉన్న సంస్థాగత బలం, ఆయన ఓపికను పరిగణనలోకి తీసుకుని సీఎం మార్పునకు శ్రీకారం చుట్టారని చెబుతున్నారు.
అయితే ఈ అధికార మార్పిడితో కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి చల్లారుతుందా? లేక ఇరు వర్గాల మధ్య సరికొత్త రాజకీయ యుద్ధానికి దారితీస్తుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గురువారం ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామ చేస్తారని, కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఈ నెల 30న జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. కొత్త సీఎం దాదాపు డీకే శివకుమార్ పేరునే అధిష్టానం ఖరారు చేసిందని చెబుతున్నారు. చూడాలి ఈ సీఎం మార్పు వార్తలపై పార్టీ అధిష్టానం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది అనేది.
