ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో… కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. ఒక రాష్ట్రం వివాదం ముగిసిందనుకుంటే… మరో రాష్ట్రంలోని నేతల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా… నాయకులు గళమెత్తుతున్నారు. మొన్న రాజస్థాన్, నిన్న పంజాబ్, తాజాగా చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పంజాబ్ వ్యవహారం క్లోజ్ అయిందనుకుని… ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో.. ఛత్తీస్‌గఢ్‌లో కొత్త లొల్లి షురూ అయింది.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా… ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా భూపేష్ భగేల్, టీఎస్ సింగ్ దేవ్ మధ్య ఒప్పందం కుదిరింది. దాని మేరకు భగేల్… ముఖ్యమంత్రి పీఠం కూర్చుకున్నారు. భగేల్ పదవికాలం ముగియడంతో… పదవికి రాజీనామా చేయాలని టీఎస్ సింగ్ దేవ్ అంటున్నారు. భగేల్ ముఖ్యమంత్రి చేపట్టి… జులై నాటికి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. అయితే, సీఎం కుర్చీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం మంత్రి టీఎస్ సింగ్ దేవ్… అధిష్ఠానంపై ఒత్తిడి పెంచారు. దీంతో ఇద్దరు నేతలు… ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు… రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ పీఎల్ పునియాతో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి మార్చాల్సిందేనని… సింగ్ దేవ్‌కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
