Hanuman Jayanti: హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు. గతేడాది అల్లర్లను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధం అయ్యారు. ఇప్పటికే హనుమాన్ శోభాయాత్ర కోసం పోలీసులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది మతపరమైన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: MS Dhoni : MCCలో జీవిత సభ్యత్వం పొందిన ఐదుగురు భారతీయ క్రికెటర్లలో MS ధోని
జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి వేడుకలను నిర్వాహకులతో సంప్రదిస్తున్నామని, వేడుకలు సురక్షితంగా జరిగేలా చూస్తామని ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్(లా అండ్ ఆర్డర్) దీపేంద్ర పాఠక్ తెలిపారు. మంగళవారం జహంగీర్‌పురి ప్రాంతంలో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ చేపట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం రోజు శోభాయాత్ర నిర్వహించనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శాంతిభద్రతల విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది.
గతేడాది ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జహంగీర్‌పురిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారు. రాళ్లదాడి, వాహనాలు దహనం వంటి హింసాత్మక సంఘటలు చోటు చేసుకున్నాయి. గతవారం రామనవమి వేడుకల్లో కూడా ఇలాంటి మతఘర్షణలే చోటు చేసుకున్నాయి. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బీహార్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మత ఘర్షణలు జరిగాయి.