Rohith Vemula Case: 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్న రోహిత్ వేముల మృతిపై తెలంగాణ పోలీసులు విచారణ ముగించారు. తుది నివేదికను దాఖలు చేశారు. తాను ఎస్సీ కులానికి చెందినవాడిని కాదని గుర్తించడంతో, అసలు కులం బయటపడుతుందనే భయంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. ఇది నిజమైతే తన అకడమిక్ డిగ్రీలను కోల్పోతాననే, విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడి ఉండొచ్చని నివేదిక పేర్కొంది. వేముల రోహిత్‌ని అనేక సమస్యలు వేధిస్తున్నాయని, అందుకు ఆత్మహత్య చేసుకునేలా చేసి ఉంటాయని పేర్కొంది. నిందితుల చర్యలే అతడి ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో హైదరాబాద్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, అప్పటి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, ఇతర బీజేపీ నేతలకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. రోహిత్ దళితుడని చెప్పే ఆధారాలు లేకపోవడంతో కేసు మూసేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు పిటిషన్‌పై దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. ఇదిలా ఉంటే, రోహిత్ వేముల సోదరుడు రాజా పోలీసులు వాదనల్ని తప్పుపట్టారు. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాయాన్ని కోరుతామని చెప్పారు. ఇది పూర్తిగా తప్పు, ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తి కులాన్ని ఎలా నిర్ణయిస్తాడు, రేపు మేము సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నామని రాజా చెప్పారు.
