PM Modi: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తన తండ్రికి గురించిన విషయాలతో ఆయన కూతురు శర్మిష్ట ముఖర్జీ పుస్తకం రాశారు. ప్రణబ్ డైరీ, ఆయన తనతో చెప్పిన విషయాల ఆధారంగా శర్మిష్ట ముఖర్జీ ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్’ బుక్‌లో కీలక విషయాలు వెల్లడించారు. ఈ పుస్తకంలోని విషయాలు ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి తన తండ్రికి ఉన్న అభిప్రాయాలను పంచుకున్నారు. రాహుల్ గాంధీకి నెహ్రూ-గాంధీ అహంకారం వచ్చినప్పటికీ, వారి రాజకీయ చతురత రాలేదని పేర్కొన్నట్లు ప్రణబ్ కూతురు వెల్లడించారు. ఆయనకు రాజకీయ పరిపక్వత లేదని డైరీలో రాసుకున్నట్లు ఆమె తెలిపారు.
ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ గురించి శర్మిష్ట ముఖర్జీ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీకి, మోడీకి ఉన్న సంబంధాల గురించి వెల్లడించారు. ప్రధాని మోడీతో, ప్రణబ్ ముఖర్జీకి విచిత్రమై సంబంధం ఉందని, మోడీ ఎప్పుడూ ప్రణబ్ ముఖర్జీ కాళ్లకు నిజాయితీతో నమస్కరించేవారని చెప్పారు.
ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంలో తన విధులు, బాధ్యతల గురించి స్పష్టంగా ఉండేవారని, మోడీ, తన తండ్రి వేర్వేరు సిద్ధాంతాలకు చెందిన వారైనప్పటికీ, పాలనలో తాను జోక్యం చేసుకోనని చెప్పినట్లు ఆమె వెల్లడించారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి వీరిద్దరి మధ్య సంబంధం ఉండేదని ఆమె తెలిపారు.
Read Also: Rahul Gandhi: “రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదు”.. ప్రణబ్ ముఖర్జీ పుస్తకంలో కీలక విషయాలు..
‘‘ అతను (ప్రధాని మోడీ) అప్పడు ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా వివిధ కార్యకలాపాల కోసం ఢిల్లీకి వచ్చేవాడినని, ఉదయం ప్రణబ్ ముఖర్జీ మార్నింగ్ వాక్ వెళ్లే సమయంలో కలిసే వాడినని, తాను ఎల్లప్పుడు ప్రణమ్ పాదాలకు నమస్కరించేవాడిని’’ అని ప్రధాని మోడీ చెప్పారని శర్మిష్ట అన్నారు. ప్రణబ్ డైరీలో ఇది ఓ ఆసక్తికరమైన విషయమని అనుకున్నానని చెప్పారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో రాష్ట్రపతిని కలిసేందుకు వచ్చినప్పుడు ప్రణబ్ ముఖర్జీ కీలక విషయాన్ని వెల్లడించారు. ‘ అతను కాంగ్రెస్ ప్రభుత్వం, దాని విధానాలపై తీవ్ర విమర్శకుడు, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడూ నా పాదాలను తాకుతాడు, ఇది తనకు ఆనందాన్ని ఇస్తుంది, ఎందుకో నాకు అర్థం కాదు’ అని ప్రణబ్ ముఖర్జీ రాశారని శర్మిష్ట చెప్పారు.
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి సంబంధాలు కేవలం వ్యక్తిగత సంబంధంపై నిర్మించబడలేదని, రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రభుత్వంలో జోక్యం చేసుకోకుండా ఉండాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని ప్రణబ్ విశ్వసించారని ఆయన కూతురు తెలిపారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారని, మీ పాలనలో జోక్యం చేసుకోనని, కానీ ఏదైనా రాజ్యాంగపరమైన విషయంలో సాయం కావాలంటే నేను ఉంటానని ప్రణబ్ చెప్పినట్లు మోడీ తనతో వెల్లడించారని శర్మిష్ట తెలిపారు.
