PM To Visit Poll-Bound Tripura, Meghalaya Today: త్వరలో ఎన్నికలు జరగబోయే త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పర్యటించనున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ. 6,800 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. హౌసింగ్, రోడ్లు, వ్యవసాయం, టెలికాం, ఐటీ, టూరిజం రంగాల్లో అనేక ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని, షిల్లాంగ్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Read Also: Marriage Cancel: కొంపముంచిన షాంపూ.. 6 గంటల్లో జరగాల్సిన పెళ్లి పెటాకులు
అగర్తలాలో ‘ప్రధాన మంత్రి అవాస్ యోజన’ కింద రెండు లక్షల లబ్ధదారులకు ఇళ్లను పంపిణీ చేయనున్నారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో 8 ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ ప్రణాళిక సంఘం అయిన నార్న్ ఈస్టర్న్ కౌన్సిల్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఎనిమిది రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. మేఘాలయలో ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత త్రిపుర వెళ్లనున్నారు.
అగర్తలలోని స్వామి వివేకానంద మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. త్రిపురలో బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ కూడా నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మేఘాలయాలో టెలికాం సేవలను మరింతగా విస్తరించేందుకు ఏర్పాటు చేసి 4జీ టవర్లను మోదీ ప్రారంభించనున్నారు. వీటిని జాతికి అంకితం చేయనున్నారు. మరో రెండు నెలల్లో త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ దృష్టి పెట్టింది. ఈ ఎన్నికలను బీజేపీ కీలకంగా భావిస్తోంది.