NTV Telugu Site icon

PM Narendra Modi: జాతీయ విద్యా విధానంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

Narendra Modi

Narendra Modi

ప్రధాని మోదీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. యూపీలో రూ.1800 కోట్ల విలువైన పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తో కలిసి వారణాసిలో పర్యటించారు. వారణాసిలో అఖిల భారతీయ శిక్షా సమాగమ్ లో ప్రసంగిస్తూ మోదీ కొత్త జాతీయ విద్యా విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యా విధానం ప్రాథమిక లక్ష్యం విద్యను సంకుచిత ఆలోచన ప్రక్రియ పరిమితుల నుంచి బయటకు తీసుకురావడమే అని ఆయన అన్నారు. 21వ శతాబ్దపు ఆధునిక ఆలోచనలకు తగ్గట్లు విద్యను ఏకీకృతం చేయడం అని అన్నారు. యువతను డిగ్రీలు ఇవ్వడమే కాదని.. దానితో పాటు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన మానవ వనరులను సిద్ధం చేయడమని అన్నారు.

Read Also: Ponniyan Selvan: పురుషుల రాజ్యంలో ధీటైన యువరాణి త్రిష

కోవిడ్ మహమ్మారి నుంచి భారతదేశం వేగంగా కోలుకుందని.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ అవతరించిందని మోదీ అన్నారు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ అని ఆయన వెల్లడించారు. కొత్త జాతీయ విద్యా విధానం కోసం దేశంలోని విద్యారంగంలో మౌళిక సదుపాయాల మెరుగుదల జరిగిందని.. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రాంతీయ భాషల్లో విద్యకు మార్గం సుగమం చేస్తోందని ఆయన అన్నారు. సంస్కృతం వంటి ప్రాచీన భారతీయ భాషలను కూడా ముందుకు తీసుకువెళుతుందని ఆయన అన్నారు. వారణాసిలో ప్రారంభించబడుతున్న ప్రాజెక్టులు నగరం డెవలప్మెంట్ కు దోహదపడుతాయని.. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో మరింతగా వారణాసిని ముందుకు తీసుకెళ్తాయని అన్నారు.