Cheetahs Release: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో శనివారం 8 చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడిచిపెట్టారు.ప్రధానమంత్రి మోడీ మొదటి ఎన్‌క్లోజర్ నుంచి రెండు చిరుతలను విడిచిపెట్టారు. ఆ తర్వాత 70 మీటర్ల దూరంలో రెండవ ఎన్‌క్లోజర్ నుండి మరొక చిరుతను విడిచిపెట్టారు. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చారు.
వన్యప్రాణుల సంరక్షణలో భారతదేశానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1972లో ప్రారంభించబడిన అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ వెంచర్లలో ఒకటి ‘ప్రాజెక్ట్ టైగర్’, పులుల సంరక్షణకు మాత్రమే కాకుండా మొత్తం పర్యావరణ వ్యవస్థకు కూడా దోహదపడింది.దీనికి కొనసాగింపుగా, చీతాలను తిరిగి ప్రవేశపెట్టడం భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ చరిత్రలో ఒక అడుగు ముందుకేసి ఒక మైలురాయి. ఈ ప్రాజెక్టుతో దాదాపు 74ఏళ్ల తర్వాత భారత్‌లోకి మళ్లీ చీతాలు ప్రవేశించాయి.
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
ఇంటర్-కాంటినెంటల్ చీతా ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా నమీబియా నుంచి 8 చీతాలను గ్వాలియర్‌కు కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లో తీసుకొచ్చారు. మహారాజ్‌పుర వైమానిక స్థావరంలో దిగిన ఈ చీతాలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. అనంతరం ఈ చీతాలను భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్‌లో కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చారు. శాటిలైట్ ద్వారా పర్యవేక్షించేందుకు అన్ని చీతాలకు రేడియో కాలర్‌లను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా, ప్రతి చిరుత వెనుక ఒక ప్రత్యేక పర్యవేక్షణ బృందం ఉంది. వారు 24 గంటల పాటు చిరుతల స్థానాన్ని పర్యవేక్షిస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో సంతకం చేసిన ఎంఓయూ కింద చీతాలను తీసుకొచ్చారు.