NTV Telugu Site icon

Mega Textile Parks: 7 రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులు.. ప్రధాని ప్రకటన.. జాబితాలో తెలంగాణ కూడా

Mega Textile Parks

Mega Textile Parks

Mega Textile Parks: దేశంలో ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్స్‌టైల్ 5ఎఫ్(ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్) విజన్ కి అనుగుణంగా టెక్స్‌టైల్స్ రంగాన్ని ప్రోత్సహిస్తాయని మోదీ వెల్లడించారు. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లలో పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Read Also: Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీ పొడగింపు

పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్ పార్కులు టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని ఆయన అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ది వరల్డ్’ కి ఇది గొప్ప ఉదాహరణ అని అన్నారు. ఆత్మనిర్భర్ ప్లాన్ లో భాగంగా భారతీయ తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, ఎగుమతులను పెంచడానికి, భారత్ ను ప్రపంచ సప్లై చైన్ లో చేర్చడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ రంగాలలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ)పథకాన్ని ప్రారంభించింది.

టెక్స్ టైల్స్ పరిశ్రమ కోసం ప్రపంచస్థాయిలో ధీటుగా మారడానికి రూ. 10,683 కోట్ల ఆర్థిక వ్యయంతో పీఎల్ఐని ప్రారంభించింది. ఈ పథకం కింద టెక్స్‌టైల్స్ పరిశ్రమలో ఇప్పటివరకు సుమారు ₹ 1,536 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు జౌళి మంత్రిత్వ శాఖ తెలిపింది. 2027-28 వరకు రూ. 4445 కోట్లతో ప్రపంచస్థాయిలో ఈ ఏడు రాష్ట్రాల్లో టెక్స్ టైల్స్ అభివృద్ధి చేసేందుకు పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ మరియు అపెరల్ (పీఎం మిత్రా) పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Show comments