Mann Ki Baat 138th Episode: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 138వ ఎపిసోడ్ లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సర్జికల్ స్ట్రైక్ 10వ వార్షికోత్సవం, దేశ వారసత్వం, పర్యావరణ పరిరక్షణ, యువత, క్రీడలు, మహిళా సాధికారత, గ్రామీణ ఆర్థికాభివృద్ధి వంటి పలు అంశాలను ప్రస్తావించారు. సర్జికల్ స్ట్రైక్ జరిగి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోడీ భారత సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు.
2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం నియంత్రణ రేఖ (LoC) దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరించిన విధానంలో సర్జికల్ స్ట్రైక్ ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచిందని ప్రధాని అన్నారు. “నేటి భారత్ ఉగ్రవాదాన్ని సహించదు” అని పేర్కొన్నారు.
అశోక్ సింఘాల్‌కు నివాళి
మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ ప్రముఖ సామాజిక నాయకుడు, విశ్వ హిందూ పరిషత్ మాజీ నేత అశోక్ సింఘాల్ ను కూడా గుర్తు చేసుకున్నారు. 1926 సెప్టెంబర్ 27న ఆగ్రాలో జన్మించిన సింఘాల్ శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. సింఘాల్ సమాజంలో ఉంటూనే తపస్వి జీవితం గడిపారని మోడీ పేర్కొన్నారు. రామ జన్మభూమి ఉద్యమానికి ఆయన దిశ, ఉత్సాహం అందించారని తెలిపారు.
మొఢేరా సూర్య దేవాలయానికి 1,000 ఏళ్ల చరిత్ర
గుజరాత్‌లోని మొఢేరా సూర్య దేవాలయం చరిత్రను కూడా ప్రధాని ప్రస్తావించారు. 1025లో రాజు భీమదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారని పేర్కొన్నారు. చారిత్రక వారసత్వంతో పాటు మొఢేరా ప్రస్తుతం దేశంలో తొలి ‘సోలార్ విలేజ్’గా కూడా గుర్తింపు పొందిందని మోడీ తెలిపారు. గత చరిత్రతో ఆధునిక సాంకేతికతను అనుసంధానం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. అసోంలో ప్రకృతి పరిరక్షణ చర్యల ద్వారా స్థానికంగా సానుకూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆయన వివరించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌లో ఝార్ఖాలి ప్రాంత మహిళలు మాంగ్రూవ్ అడవులను అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. వీరిలో కొందరు పులి దాడుల్లో భర్తలను కోల్పోయిన మహిళలు ఉన్నారని తెలిపారు. మహిళలు పెంచుతున్న మాంగ్రూవ్ చెట్లు గ్రామాలకు సహజ రక్షణ కవచంగా మారడంతో పాటు వారికి ఆదాయ వనరుగా కూడా ఉపయోగపడుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దీనిని పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతకు అనుసంధానమైన ప్రయత్నంగా వివరించారు.
‘నషా ముక్త్ యువ అభియాన్’పై ప్రస్తావన
యువతలో మాదకద్రవ్యాల వినియోగాన్ని తగ్గించేందుకు జరుగుతున్న ‘నషా ముక్త్ యువ అభియాన్’ గురించి కూడా మోడీ మాట్లాడారు. లక్షలాది మంది యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయడంతో పాటు, ఈ సందేశాన్ని ఇతరులకు చేరవేసే బాధ్యతను కూడా తీసుకున్నారని ఆయన తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల హాకీ ప్రతిభకు కొత్త వేదిక
క్రీడల అంశంలో రాజిందర్ సింగ్ సీనియర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని ప్రస్తావించారు. గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఉన్న హాకీ ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ అందించడంలో ఆయన చేస్తున్న కృషిని మోడీ అభినందించారు. దేశం క్రీడల్లో మరింత మెరుగ్గా రాణించాలంటే గ్రామాలు, పట్టణాల వరకు వెళ్లి ప్రతిభను గుర్తించడం అవసరమని ప్రధాని అన్నారు. సరైన శిక్షణ, అవకాశాలు లభిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా గొప్ప క్రీడాకారులు వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు.
ఆవాలతో ఉపాధి అవకాశాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ ఆవాల గురించి కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఆవాల ప్రాసెసింగ్ ద్వారా రైతులు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రతాప్‌గఢ్‌లో ఆవాల ప్రాసెసింగ్‌కు సంబంధించిన సుమారు 100 యూనిట్లు పనిచేస్తున్నాయని, ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. దేవ్‌గఢ్ కమాసీ గ్రామంలోని సావిత్రీ ఫూలే స్వయం సహాయక సంఘం మహిళలు ఆవాలతో క్యాండీ, మురబ్బా, జ్యూస్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారని ఉదాహరణగా చెప్పారు. ODOP (One District One Product) ద్వారా మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరగడంతో వారి ఆదాయం కూడా పెరుగుతోందని తెలిపారు.
దేశ వారసత్వం నుంచి కొత్త అవకాశాల వరకు
138వ మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ దేశ చరిత్ర, వారసత్వంతో పాటు పర్యావరణ పరిరక్షణ, యువత, క్రీడలు, మహిళా సాధికారత, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రజల స్థానిక స్థాయి ప్రయత్నాలు సామాజిక, ఆర్థిక మార్పులకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

