సోమనాథ్ ఆలయం.. భారతదేశంలో ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. పురాతన కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం అనేక సార్లు విధ్వంసానికి గురై పునర్నిర్మించబడింది. విధ్వంసానికి గురై జనవరి 2026తో 1,000 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా సోమనాథ్ విశిష్టతను తెలియజేస్తూ ప్రధాని మోడీ ప్రత్యేక వ్యాసం రాశారు.

సోమనాథ్ ఆలయం.. గుజరాత్‌లోని వెరావల్ సమీపంలోని ప్రభాస్ పటాన్ దగ్గర నిర్మితమైన పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం. 12 జ్యోతిర్లింగాల్లో మొదటిది. రాతితో అద్భుతమైన శిల్పాలతో నిర్మితమైంది. అనేకసార్లు ధ్వంసానికి గురైంది. జనవరి 1026లో ఈ ఆలయంపై గజనీ మహమూద్ దాడి చేసి నాశనం చేశాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో తిరిగి పునర్నిర్మించబడింది. ఈ ఘట్టానికి 2026లో 75 ఏళ్లు పూర్తైంది.

‘‘సోమనాథ్ ఆలయం కథ.. కేవలం ఒక దేవాలయం చరిత్ర కాదు. అది భారతదేశ ఆత్మ. బలానికి నిలువెత్తు నిదర్శనం. సరిగ్గా వెయ్యేళ్ల క్రితం.. క్రీస్తుశకం 1026లో సోమనాథ్ ఆలయంపై తొలి దాడి జరిగింది. ఆ విధ్వంసానికి వెయ్యేళ్లు పూర్తయినా నేడు సోమనాథ్ ఆలయం అపూర్వ వైభవంతో గర్వంగా నిలిచి ఉంది. కోట్లాది భక్తుల భక్తి, ప్రార్థనలతో పునీతమైన ఈ పవిత్ర క్షేత్రం విదేశీ దాడిదారుల లక్ష్యంగా మారిందన్నారు. ఆ దాడుల వెనుక భక్తి లేదని, కేవలం విధ్వంసమే లక్ష్యంగా ఉంది.’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

‘‘సోమనాథ్ చరిత్రను విధ్వంసం నిర్వచించలేదు. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ ఆలయ గాథను నిర్వచించేది ధ్వంసం కాదు. భారతమాత కుమారులైన కోట్లాది మంది అపరాజిత ధైర్యసాహసాలే. ఎన్నో దాడులు, అవమానాలు ఎదురైనా సోమనాథ్ మళ్లీ మళ్లీ పునరుజ్జీవనం పొందింది. మన నాగరికత అజేయ ఆత్మశక్తికి సోమనాథ్ కన్నా గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. ఎన్నో కష్టాలు, అడ్డంకులు దాటి ఈ ఆలయం నేడు వైభవంగా నిలవడం భారత సంస్కృతిలోని స్థిరత్వం, విశ్వాసానికి నిదర్శనం. ద్వేషం, మూఢత్వం క్షణికంగా విధ్వంసం చేయగలిగినా.. విశ్వాసం, సద్గుణాలపై నమ్మకం శాశ్వతంగా సృష్టి చేయగలవని సోమనాథ్ చరిత్ర మనకు బోధిస్తుంది.’’ అని మోడీ తెలిపారు.
నెహ్రూపై విమర్శలు..
‘‘స్వాతంత్ర్యం తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పూనుకున్నారు. ఆలయాన్ని అదేచోట తిరిగి నిర్మిస్తామని 1947 దీపావళి సమయంలో వెల్లడించారు. 1951 మే 11న ఆలయం తిరిగి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆ సమయానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్నుమూశారు. మాజీ ప్రధాని నెహ్రూ ఈ ఆలయ పరిణామంపై పెద్ద ఉత్సాహంతో లేరు. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు ఈ ప్రత్యేక కార్యక్రమానికి వెళ్లకూడదని ఆయన కోరుకున్నారు. సోమనాథ్ మహదేవుని ఆశీస్సులతో విశ్వమానవ సంక్షేమానికి మనం మున్ముందుకు వెళ్తునే ఉంటాం. జై సోమనాథ్!.’’ అంటూ మోడీ పేర్కొన్నారు.

Jai Somnath!
2026 marks 1000 years since the first attack on Somnath took place. Despite repeated attacks subsequently, Somnath stands tall! This is because Somnath’s story is about the unbreakable courage of countless children of Bharat Mata who protected our culture and…
— Narendra Modi (@narendramodi) January 5, 2026