NTV Telugu Site icon

BJP Founder Day: కార్యకర్తలకు మోడీ, అమిత్ షా, నడ్డా శుభాకాంక్షలు

Ameie

Ameie

భారతీయ జనతా పార్టీ తన 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం జరుపుకుంటోంది. 1980, ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ స్థాపింపబడింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. గత పదేళ్లుగా దేశంలో కమలం పార్టీ అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కమలనాథులు ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోడీ శనివారం ప్రసంగించనున్నారు. ప్రతి సంవత్సరం, వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో వివిధ కార్యక్రమాలు, ప్రసంగాలు, పార్టీ ప్రయాణం, విజయాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలపై చర్చిస్తుంటారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తారో చూడాలి.

మోడీ..
ఇక బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ కార్యకర్తలనుద్దేశించి ట్వీట్ చేశారు. భారతదేశం నలుమూలలా ఉన్న పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయులందరి కృషి, పోరాటాలు, త్యాగాలను స్మరించుకుందామని చెప్పారు. పార్టీ ఈ స్థాయిలో ఉండడానికి అనేక సంవత్సరాలుగా నాయకులు కష్టపడ్డారని గుర్తుచేశారు. బీజేపీకి ఎప్పుడూ దేశమే ప్రాముఖ్యమని.. దేశ అభివృద్ధి కోసం బీజేపీ పని చేస్తోందని మోడీ తెలిపారు.

అమిత్ షా..
బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మార్చే ప్రయాణంలో తమ జీవితాలను అంకితం చేసిన కార్యకర్తలకు నమస్కరిస్తున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. భారత్‌ను ప్రధాని మోడీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు.

జేపీ నడ్డా..
దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరించడానికి కృషి చేసిన కార్యకర్తలకు, నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో వికసిత భారత్ కోసం కార్యకర్తలు కృషి చేయాలని.. సార్వత్రిక ఎన్నికల్లో మరింతగా పార్టీ విజయానికి కృషి చేయాలని నడ్డా పిలుపునిచ్చారు.