PM Modi: 2047 డెడ్‌లైన్.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం.. మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు

Pm Modi

Pm Modi

PM Modi: ప్రజాస్వామ్యంలో మీడియా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మీడియా సానుకూల ధోరణితో పనిచేస్తూ దేశాభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి భారతదేశ విజయగాథను వినిపించే దిశగా మీడియా కృషి చేయాలని సూచించారు. భారత్ సాధిస్తున్న విజయాలు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తుల విజయాలపై ప్రత్యేక కథనాలు ప్రచురించాలని కోరారు. ఇదే దేశానికి మీడియా అందించే గొప్ప సేవ అని పేర్కొన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన దీపావళి మిలన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మోడీ ముచ్చటిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే లక్ష్యం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. మీడియా వార్తలకు డెడ్‌లైన్ ఉన్నట్లుగానే వికసిత్ భారత్ సాధించేందుకు కూడా 2047 అనే లక్ష్య గడువు ఉందని వ్యాఖ్యానించారు. ఈ లక్ష్య సాధన కోసం చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. దేశం పెట్టుకున్న ఏ లక్ష్యమూ అసాధ్యం కాదని ధీమా వ్యక్తం చేశారు. అయితే, డ్రగ్స్ రహిత భారత్, దేశ ఐక్యతపై కథనాలు రావాలి.. దేశాన్ని డ్రగ్స్ విముక్తంగా మార్చడం, జాతీయ ఐక్యతను బలోపేతం చేయడం, వికసిత్ భారత్ లక్ష్య సాధన వంటి కీలక అంశాలకు మీడియా తన కథనాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ సూచించారు. దేశంలో జరుగుతున్న సానుకూల మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. ప్రపంచ వేదికపై భారత్ సాధిస్తున్న విజయాలను అంతర్జాతీయ సమాజానికి వివరించేలా వార్తలు, కథనాలు ఉండాలని ఆకాంక్షించారు.

12 ఏళ్లలో దేశంలో ఎన్నో మార్పులు
గత 12 ఏళ్లలో భారత్‌లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని మోడీ వివరించారు. ఒకప్పుడు కనీసం మట్టి రోడ్డు వేయాలని వినతిపత్రాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దేశంలో ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తున్నామని గుర్తుచేశారు. రైల్వే వ్యవస్థలో పూర్తిస్థాయిలో విద్యుదీకరణ చేపట్టామని తెలిపారు. గత 12 ఏళ్లలో 50 కోట్ల మందిని అత్యంత పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ఇక, కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి క్షేత్రస్థాయిలో పూర్తి అంకితభావంతో పనిచేసే ఫీల్డ్ రిపోర్టర్ల కృషి తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. చిన్న, పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అందరూ పనిచేయాలని సూచించారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.

మీడియాతో గత అనుభవాలను గుర్తుచేసుకున్న మోదీ
ఈ సందర్భంగా మీడియాతో తనకున్న అనుబంధాన్ని ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ కోసం పరుగులు తీసే మీడియా ప్రతినిధులు నాన్ బ్రేకింగ్ న్యూస్ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని చమత్కరించారు. గతంలో కనీసం ప్రెస్ రిలీజ్ పంపించడానికి కూడా కష్టపడాల్సిన రోజులను చూశానని తెలిపారు. అప్పట్లో మీడియా ప్రతినిధులతో మంచి ఆత్మీయ సంబంధాలు ఉండేవని, ఆ అనుభవాల నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. రిపోర్టర్ నుంచి ఎడిటర్‌గా మారినట్లుగా తన బాధ్యతలు కూడా మారాయని మోడీ వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఒకసారి మహిళా ప్రతినిధుల బృందం తన వద్దకు వచ్చి, తాను ముఖ్యమంత్రి కాబోతున్నానని, ఆ సందర్భంగా మిఠాయి తినిపించాలని కోరిందని తెలిపారు. తనకంటే ముందే వారికి ఈ విషయం తెలిసిందని సరదాగా చెప్పారు. ఆ తర్వాత కాలంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు.

టెక్నాలజీతో మారిన మీడియా స్వరూపం
కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో మీడియా స్వరూపం పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. అదే సమయంలో మీడియా రంగంలో సవాళ్లు కూడా పెరిగాయని పేర్కొన్నారు. ఒకప్పుడు వార్తల సేకరణకు పెద్ద పెద్ద పరికరాలు అవసరమయ్యేవని, ఇప్పుడు మొబైల్ ఫోన్‌నే ఓబీ యూనిట్‌గా ఉపయోగించే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా మీడియా కూడా ముందుకు సాగాలని సూచించారు. దేశాభివృద్ధి, ప్రజాస్వామ్య బలోపేతం, జాతీయ ఐక్యత వంటి అంశాల్లో మీడియా మరింత చురుకైన పాత్ర పోషించాలని ప్రధాని మోడీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.