SCO Forum 2026: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు (నవంబర్ 20, 2026) తొలి షాంఘై సహకార సంస్థ (SCO) నాగరికతల సంభాషణ వేదిక (Civilisational Dialogue Forum)ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జరిగే సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని చారిత్రక పురానా ఖిలాలో నవంబర్ 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు ఈ ఫోరం జరగనుంది.
SCO సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించడం, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, వివిధ సంస్కృతుల మధ్య పరస్పర అవగాహన, సహకారాన్ని పెంపొందించడం ఈ వేదిక ప్రధాన లక్ష్యాలు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన పండితులు, విద్యావేత్తలు, నిపుణులు, సాంస్కృతిక రంగ ప్రతినిధులు పాల్గొననున్నారు. SCO దేశాల ఉమ్మడి నాగరికతా వారసత్వంపై వారు చర్చించనున్నారు.
2025లో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన SCO సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. SCO పరిధిలో నాగరికతల మధ్య సంభాషణకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అనంతరం ఈ ప్రతిపాదనకు SCO బిష్కెక్ డిక్లరేషన్‌లో స్వాగతం లభించింది. ఈ వేదిక ద్వారా భారత్‌తో పాటు యూరేషియా ప్రాంతంలోని దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింతగా వెలుగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
‘వసుధైవ కుటుంబకం – ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే ఇతివృత్తంతో ఈ ఫోరం నిర్వహించనున్నారు. భారతదేశం, యూరేషియా ప్రాంతాల మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాలను ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రస్తావించనుంది. ఈ సందర్భంగా భారతదేశ పురావస్తు, కళా, సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేసే ‘ASTITVA – The Essence of Our Existence’ పేరుతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రదర్శనలో క్రీస్తుపూర్వం 1200 నుంచి క్రీ.శ. 1200 వరకు ఢిల్లీ చరిత్రకు సంబంధించిన పురావస్తు ఆధారాలను సందర్శకులకు పరిచయం చేయనున్నారు. తవ్వకాల్లో బయటపడిన అవశేషాలు, పురాతన వస్తువులు, నిర్మాణాలకు సంబంధించిన భాగాలు, ఇతర చారిత్రక ఆధారాలను ప్రదర్శించనున్నారు. అలాగే ‘మహాభారత స్క్రోల్ పెవిలియన్ – అనంత్: అరుదైన 18వ శతాబ్దపు మహాభారత చిత్రపట చుట్ట’ పేరుతో మరో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భారతీయ ఇతిహాస సంప్రదాయాలు, కళా వైభవాన్ని ప్రతిబింబించే చిత్రాలతో కూడిన పురాతన స్క్రోల్‌ను ప్రదర్శించనున్నారు.
ఉమ్మడి సంప్రదాయాలపై నాలుగు కీలక చర్చలు
నవంబర్ 21, 22 తేదీల్లో ఈ ఫోరంలో నాలుగు ప్రధాన అంశాలపై ప్రత్యేక చర్చా సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన పండితులు, విద్యావేత్తలు, నిపుణులు, సాంస్కృతిక ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
చర్చించనున్న అంశాలు:
సాంస్కృతిక వ్యక్తీకరణలు: సంగీతం, ప్రదర్శన కళలు, వస్త్ర సంప్రదాయాలు, వంటకాలు, సంప్రదాయ క్రీడలు.
కళలు, వాస్తుశిల్పం: వివిధ దేశాల మధ్య ఉన్న ఉమ్మడి కళా, నిర్మాణ సంప్రదాయాలు.
భాష, సాహిత్యం: భాషలు, లిపులు, పురాతన గ్రంథాలు, మాన్యుస్క్రిప్ట్‌ల సంప్రదాయాలు.
మఠాల మార్గాలు, తాత్విక సంప్రదాయాలు: ఆధ్యాత్మిక కేంద్రాలు, తత్వశాస్త్రాలు, వాటి మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు.
ఈ చర్చల ద్వారా SCO దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధాలు, చారిత్రక సంబంధాలపై మరింత అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళలోని జటాయు ఎర్త్ సెంటర్‌ను సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ చిత్రం ‘రామాయణ్’ విడుదల అనంతరం ఈ ప్రాంతంలోని భారీ జటాయు శిల్పం మరోసారి విస్తృతంగా చర్చలోకి వచ్చింది. కేరళలోని చడయమంగళంలో ఉన్న ఈ జటాయు శిల్పం ఇప్పటికే ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలిచింది. రామాయణ కథలో రావణుడితో జటాయువు చేసిన పోరాటాన్ని సినిమాలో చూపించిన తీరు ఈ ప్రదేశంపై ప్రజల్లో ఆసక్తిని మరింత పెంచినట్లు తెలుస్తోంది.

