PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈసారి తమిళనాడులో ‘‘పొంగల్’’ పండగ వేడుకలు జరుపుకునే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఆయన పర్యటించే ఛాన్స్ ఉంది. ఈ పర్యటనలో రైతులతో కలిసి పొంగల్ జరుపుకోనున్నారు. 2026తో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ పర్యటన కీలకంగా మారే అవకాశం ఉంది. ఇది గ్రామీణ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు సాంస్కృతిక ఏకీకరణను పెంపొందించే ప్రయత్నంగా చూస్తున్నారు.
పంటల పండగగా పిలిచే ‘‘పొంగల్’’ వేడుకల్ని తమిళనాడులో ప్రధాని మోడీ జరుపుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. గ్రామీణ తమిళనాడుతో బీజేపీ సంబంధాలను బలపరచడం, తమిళ సంస్కృతి, గుర్తింపుపై తన ప్రాధాన్యతను నొక్కి చెప్పడాన్ని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం, తమిళనాడు-కాశీ మధ్య నాగరికత, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి కాశీ తమిళ సంగమం 4.0 ముంగిపు వేడుకలకు ప్రధాని రామేశ్వరం వెళ్లే అవకాశం ఉంది. వీటిలో పాటు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నేతృత్వంలో పుదుక్కోటలో జరగనున్న రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమం ‘తమిళగం తలై నిమిర తమిళనిన్ పయనం’ ముగింపు కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది.
Read Also: Kerala: కేరళలో లోకల్ పోల్స్‌లో బీజేపీ సంచలనం.. “రాజధాని” కైవసం..
ఎన్నికలకు ముందే ప్రధాని పర్యటనతో తమిళనాడులో ఎన్డీయే ఒక రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉందని, పలు ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరవచ్చని తెలుస్తోంది. రాబోయే తమిళనాడు ఎన్నికల కోసం వ్యూహాలు, సమన్వయం, కార్యచరణ ఖరారు చేయడానికి మోడీ ఎన్డీయే నాయకులతో సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం, తమిళనాడులో ఎన్డీయేను మరింత బలపరచడానికి పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే), దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే), అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) , బహిష్కృత ఏఐఏడీఎంకే నాయకుడు ఓ. పన్నీర్‌సెల్వంతో సహా పలు పార్టీలతో చర్చలు జరుపుతోంది. ప్రధాని పర్యటనకు ముందే ఈ పొత్తు చర్చలు ముగియాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైన వీకే శశికళతో కూడా ఎన్డీయే చర్చలు జరుపుతోంది.
