NTV Telugu Site icon

PM Modi: 45 గంటల ధ్యానాన్ని ముగించిన ప్రధాని నరేంద్రమోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌లో ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన 45 గంటల ధ్యానాన్ని శనివారం ముగించారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఆయన మే 30న కన్యాకుమారి చేరుకున్నారు. హిందూ తత్వవేత్త స్వామి వివేకానంద ఒకప్పుడు ధ్యానం చేసిన అదే ప్రాంతంలో మోడీ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల చివరి విడత ప్రచారం ముగిసిన కొద్దిసేపటికే ఆయన కన్యాకుమారి చేరుకున్నారు. చివరి విడత పోలింగ్ ముగిసే శనివారం ధ్యానాన్ని ముగించారు.

Read Also: Srisailam: శ్రీశైలంలో సరిహద్దు వివాదం.. ఆలయ, అటవీశాఖ అధికారుల వాగ్వాదం

ఇదిలా ఉంటే మోడీ ధ్యానంపై ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆర్జేడీ పార్టీల నేతలు మండిపడ్డారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ శనివారం కన్యాకుమారిలో ప్రధాని మోదీ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను కేవలం “ఫోటో షూట్‌లు” అని కొట్టిపారేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. భక్తి ఉంటే అది ఇంట్లో చూపించుకోవాలని, దేవుడిని రాజకీయాలను కలపొద్దని చెప్పారు.

ప్రధాని మోడీ 75 రోజుల ఎన్నికల ప్రచారంలో 206 ఎన్నికల ర్యాలీలు,రోడ్ షోలు, దాదాపుగా 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీని తర్వాత ఆయన ఆధ్యాత్మిక యాత్రలకు శ్రీకారం చుట్టారు. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత కేదార్‌నాథ్ పర్యటనకు వెళ్లారు. 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్ సందర్శించారు. 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఏడుదశల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.