PM Modi: విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా యాక్షన్‌లోకి దిగారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని ‘సేవా తీర్థ’లో కేంద్ర మంత్రివర్గ అత్యవసర కీలక సమావేశాన్ని ప్రధాని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు జూనియర్ మంత్రులు (సహాయ మంత్రులు) అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, ఎవరూ ఢిల్లీ వదిలి వెళ్లకూడదని ఆకస్మిక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం దీనిని ఒక సాధారణ సమావేశంగా పరిగణించడం లేదు. విదేశాల నుంచి ల్యాండ్ అవ్వడమే ఆలస్యం ప్రధాని ఈ ఉన్నత స్థాయి భేటీకి అధ్యక్షత వహించనుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ కీలక భేటీలో దేశ భద్రత, ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ పరిణామాలపై సీనియర్ ప్రభుత్వ అధికారులు ప్రధాని, మంత్రులకు సమగ్ర వివరణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజల జీవితాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే రెండు ప్రధానాంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
1. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు – ముడి చమురు సంక్షోభం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల ముడి చమురు ధరలు పెరగడం, సరఫరా గొలుసు దెబ్బతినడం, తద్వారా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలపై ప్రభుత్వం నిఘా ఉంచింది. ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో.. హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిలతో కూడిన ఒక ఉన్నత స్థాయి బృందం ఈ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చింది. దేశంలో ముడి చమురు, ఎల్‌పీజీ (LPG) తగినంత నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. నేటి భేటీలో దీనిపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
2. మోదీ 3.0 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ?
ఈ సమావేశం చుట్టూ ఉత్కంఠ పెరగడానికి రెండో బలమైన కారణం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. జూన్ 10 నాటికి మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో, దీనికి ముందే భారీ స్థాయిలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు చేర్పులు జరగవచ్చని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. జూన్ రెండో వారంలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. అందువల్ల, గురువారం సాయంత్రం జరగబోయే ఈ అత్యవసర సమావేశాన్ని సదరు పునర్వ్యవస్థీకరణకు నాందిగా (కసరత్తుగా) రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ పరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎలాంటి సంచలన నిర్ణయాలు రాబోతున్నాయి అనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
