బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయని ప్రధాని మోడీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బ్రిక్స్ ద్వారా భారతదేశం ప్రపంచానికి చేరుకుంటుందన్నారు. బ్రిక్స్‌లో ఉన్న 21 దేశాల కుటుంబం ప్రపంచంలో సగానికి సమానం అని వ్యాఖ్యానించారు. 2006లో ఈ కూటమిని ప్రారంభించినప్పుడు కేవలం నాలుగు దేశాలే ఉన్నాయన్నారు. ఇప్పుడు బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి 21 దేశాల కుటుంబంగా మారిందని తెలిపారు. ఈ దేశాలు ప్రపంచ జనాభాలో 50 శాతమని.. ప్రపంచ వాణిజ్యంలో 25 శాతం వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.
ఆర్థిక వృద్ధి ప్రపంచ వృద్ధి రేటు కంటే రెండింతలు వేగవంతమైందని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి అత్యాధునిక సాంకేతికల వరకు బ్రిక్స్ దేశాలు కొత్త ఆవిష్కరణలు ఆవిష్కరించాయని చెప్పారు. బ్రిక్స్ పెరుగుతున్న స్థాయి, వేగం, ఆశావాదం స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రపంచంలో సంక్షోభం ఉన్నప్పటికీ భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అంతరిక్షం, బయోటెక్‌తో పాటు అనేక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఇన్నోవేట్ ఇన్ ఇండియా’, ‘సేల్ ఫర్ ది వరల్డ్’ వంటి కార్యక్రమాలు కింద భారతదేశంలో ఒక స్టార్టప్ విప్లవం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రపంచంలో వ్యాపారానికి ఉన్న అడ్డంకులు అన్ని తొలగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

