Site icon NTV Telugu

PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు

Modi

Modi

మే 4న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ప్రధాని మోడీ అన్నారు. రెండో దశలో ఎన్నికలు జరగబోయే జిల్లాల్లో గురువారం ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృష్ణానగర్‌లో జరిగిన విజయ సంకల్ప సభలో మోడీ ప్రసంగించారు. మే 4వ తేదీన విజయ సంబరాలు జరుగుతాయని.. బాణాసంచా సిద్ధం చేసుకోవాలని.. స్వీట్లు, ఝల్‌మరి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

‘‘నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గత 50 ఏళ్లలో హింస చాలా తక్కువగా జరిగిన మొదటి ఎన్నికలను చూశాను. లేకపోతే ప్రతి వారం ఎవరో ఒకరిని ఉరితీసేవారు. వారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేవారు. ఒక రకంగా చెప్పాలంటే.. గూండాయిజం ఉండేది. బెంగాల్‌లో ప్రజాస్వామ్య ప్రతిష్టను మరోసారి నెలకొల్పినందుకు ఎన్నికల సంఘానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. శాంతియుత ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల సంఘం సాధించిన ఈ విజయం ఒక గొప్ప ఘనత. ఈసారి శాంతియుత ఎన్నికలు జరిగేలా చూడటంలో తమ పాత్రను చాలా బాధ్యతాయుతంగా పోషిస్తున్న ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.’’ అని అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గురువారం తొలి దశలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈనెల 29న రెండో దశలో భాగంగా 142 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి. ఇక్కడ ప్రధానంగా టీఎంసీ-బీజేపీ మధ్య పోటీ నెలకొంది.

Exit mobile version