BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్‌ గత చరిత్రపై బీజేపీ ఫైర్..

  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు..
  • కాంగ్రెస్ తీరుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ ఆగ్రహం..
  • ఎన్నికల కమిషనర్లను కేంద్రమంత్రుల్ని, గవర్నర్లను చేసింది కాంగ్రెసే అని ఎదురుదాడి..
Piyush Goel

Piyush Goel

BJP: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి నేతలు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. అయితే, ఈ నిరసనలపై అధికార బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రన్ పార్టీ ఎన్నికల కమిషనర్లను కేంద్ర మంత్రులుగా, గవర్నర్‌లుగా నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, నిరాధారమైనవి అన్నారు.

మాజీ సీఈసీ ఎంఎస్ గిల్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడాన్ని ఆయన ప్రస్తావించారు. గిల్ ఎన్నికల కమిషనర్‌గా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, ఇది రాజకీయ బేరసారాలకు ప్రతీక అని పీయూష్ గోయల్ అన్నారు. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ పదవీ కాలం 1996 డిసెంబర్‌లో ముగిసిన తర్వాత, 1997లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గవర్నర్‌గా నియమించిందని ఆరోపించారు. ఇలా ఎన్నికల కమిషనర్లకు పదవీ కాలం తర్వాత రాజకీయ పదవులు కేటాయించడం వారు చేసి పనికి ప్రతిఫలం ఇచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు.

మాజీ ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా నియామకంపై కూడా బీజేపీ ప్రశ్నల వర్షం కురిపించింది. 2005లో నవీన్ చావ్లా నియామకంలో ప్రధాని, కేంద్ర ప్రభుత్వమే కీలక పాత్ర పోషించిందని అన్నారు. టికారాం మీనా కేరళ ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన తర్వాత రాజస్థాన్ కాంగ్రెస్ మెనిఫెస్టో కమిటీలో చేరారని ఆరోపించారు.